Chairman’s Desk: సినిమాకి ఎంతమంది పనిచేసినా.. పేరుకి 24 విభాగాలున్నా.. వారందరికీ ఉపాధి దొరకాలంటే.. నిర్మాతలు సినమాలు తీయాల్సిందే. అంటే అందరూ కచ్చితంగా నిర్మాతను గౌరవించాలి. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ టాలీవుడ్‌లో నిర్మాతల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. మామూలుగా ఏ రంగంలో అయినా పెట్టుబడిదారులే ఆయా కంపెనీల కార్యకలాపాల్ని నియంత్రిస్తారు. వ్యాపారం ఎలా చేయాలి.. ఎవర్ని ఉద్యోగులుగా తీసుకోవాలి. ఇలా అన్నీ వారిష్టప్రకారమే జరుగుతాయి. కానీ సినిమాల్లో మాత్రం ఎన్ని వందల కోట్లు బడ్జెట్ పెట్టే నిర్మాత అయినా సరే.. తన సినమాకి ఎవరు పనిచేయాలో తాను డిసైడ్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. కాదు కాదు. అలా తనకు తానే వెనక్కివెళ్లిపోయాడు. కొన్నాళ్లుగా దిగజారుతూ వచ్చిన నిర్మాతల స్థితి.. గత పదేళ్లలో మరీ అధఃపాతాళానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అసలు సినిమా అంటే ఏమిటో ఏబీసీడీ కూడా తెలియని నయా నిర్మాతల రాకే అని చెప్పాలి. ఈ నయా నిర్మాతలకు సినిమాల గురించి అవగాహన జీరో. కేవలం ఎక్కడో సంపాదించిన డబ్బులున్నాయి కాబట్టి.. అవి తెచ్చి ఇక్కడ గుమ్మరిస్తే.. అంతకు అంత లాభాలు కళ్లజూడొచ్చనే దురాశ మాత్రమే ఉంటోంది. అందుకే క్రేజీ హీరో, డైరక్టర్ కాంబినేషన్ సెట్ చేయడమే లక్ష్యంగా.. వారు డేట్స్ లేవన్నా సరే.. వెంటపడి మరీ అడ్వాన్సులు ముట్టజెబుతారు. కావాలంటే రెమ్యూనరేషన్‌లో సగం అడ్వాన్స్ ఇవ్వటానికి కూడా రెడీ అనే నిర్మాతలున్నారంటే నమ్మాల్సిందే. వీరి పిచ్చి చూసి.. హీరోలు, డైరక్టర్లు కొండెక్కి కూర్చుంటున్నారు. డేట్స్ ఖాళీ ఉన్నా.. లేవని చెబుతూ.. నిమిషాల వ్యవధిలో కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్లు పెంచుకుంటున్నారు. వన్ సినిమా వండర్ లాంటి నిర్మాతలు ఎంతైనా నో చెప్పకుండా ఇచ్చుకుంటూ పోతున్నారు. వీరి దెబ్బకు దశాబ్దాలుగా సినిమానే జీవితంగా బతుకుతున్న నిర్మాతలు.. అసలు సినిమాల నిర్మాణమే తగ్గించుకోవటమో, పూర్తిగా మానుకోవడమో చేస్తున్నారు. ఈ పోకడ నయా నిర్మాతలకు మరింతగా కలిసొస్తోంది. అంతిమంగా అసలు సినిమా అంటే ఏమాత్రం అవగాహన లేని నిర్మాతలే యాక్టివ్ ప్రొడ్యూసర్లుగా చలామణి అవుతున్నారు. వీరి అభిప్రాయమే.. మొత్తం నిర్మాతల అభిప్రాయంగా మారిపోతోంది. దీంతో హీరోలు, డైరక్టర్లకు మరింతగా గేమ్ ఆడే అవకాశం వస్తోంది. చివరకు ఈ నయా నిర్మాతలు కూడా బావుకునేది ఏమీ లేదు. ఉన్నదంతా పోగొట్టుకుని.. ఇండస్ట్రీని వదిలేసిపోతున్నారు.
గతంలో సి పుల్లయ్య, బి నాగిరెడ్డి, చక్రపాణి, డి రామానాయుడు, కేఎస్ రామారావు, అశ్వనీదత్, దేవీవరప్రసాద్ లాంటి నిర్మాతలు యాక్టివ్‌గా ఉన్నప్పుడు…ఆర్థిక క్రమశిక్షణ, కథ, స్క్రీన్ ప్లేలో భాగస్వామ్యం..నటీనటుల ఎంపికలో జాగ్రత్తలు…ప్రొడక్షన్ కాస్ట్‌పై నియంత్రణ ఇవన్నీ నిర్మాత చేతిలోనే ఉండేవి. క్రమక్రమంగా నిర్మాత అనేవాడు…మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సప్లై చేసేవాడిగా మారిపోయాడు. సినిమా మొత్తం హీరోలు, డైరెక్టర్ల చేతిలోకి వెళ్లిపోయింది. హీరో సెంట్రిక్‌గా ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నడుస్తుందో…అప్పుడే దాని పతనం మొదలైంది. హీరో తన రెమ్యూనరేషన్, హీరోయిన్, ఆమె రెమ్యూనరేషన్‌ను తానే డిసైడ్ చేస్తున్నాడు. షెడ్యూల్‌ను డిసైడ్ చేస్తున్నాడు…తనకు ఎలాంటి డైలాగ్‌లు ఉండాలో కూడా హీరోనే డిసైడ్ చేస్తున్నాడు. నిర్మాతకు ఇంకేం పని లేదు.. అడిగినపుడల్లా డబ్బు ఇవ్వడమే నిర్మాత పని.
తెలుగు సినిమా ప్రస్తుత దుస్థితికి హీరోలే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సినిమా హీరో చుట్టూనే తిరుగుతోంది. అలాంటి హీరోలు బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటూ.. టాలీవుడ్ మనుగడతో ఆడుకుంటున్నారు. ఠంచనుగా ఏడాదికి మూడు సినిమాలు తీసేది ఎలాగూ లేదు. కనీసం ఏటా ఒక్క సినిమా అయినా రిలీజ్ చేద్దామనే లక్ష్యం పెట్టుకోవడం లేదు. కథ ఓకే కాలేదని ఏడాది కాలక్షేపం చేసి.. షూటింగ్ పేరుతో రెండు, మూడేళ్లు సాగదీసి.. పోస్ట్ ప్రొడక్షన్ పేరుతో మరో ఏడాది లాగించాక కానీ సినిమా రిలీజ్ కానీయడం లేదు. అంటే నాలుగైదేళ్లుగా ఒక్క సినిమాకే వెచ్చిస్తున్నారు. ఈ సమయంలో హీరోగారి ఖర్చే కాదు.. వారి స్టాఫ్ ఖర్చు కూడా నిర్మాతే భరించాలి. క్యారవాన్, ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్ అద్దెలు.. ఇలా బిల్లు తడిసిమోపెడవుతోంది. కొంతమంది హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే.. వారి మెయింటినెన్స్ కు అంతకు రెండు, మూడింతలౌతోంది. కొంతకాలం క్రితం హీరోల స్టాఫ్ ఖర్చు తగ్గించాలని కొందరు నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు పెట్టినా.. అవి కొన్ని రోజులు కూడా అమలుకు నోచుకోలేదు. హీరో మెయింటినెన్స్ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలనే రూలేం లేదు. హీరో గారి మూడ్ మారినప్పుడల్లా.. మెయింటినెన్స్ మారిపోతుంది. అలా నిర్మాతకు ఖర్చు కూడా పెరిగిపోతోంది. అయినా సరే కిమ్మనకుండా అడిగినవన్నీ సమకూర్చాల్సిందే. ఓ షెడ్యూల్ ను వంద కోట్ల రూపాయలతో ప్లాన్ చేసుకున్నాక.. లొకేషన్ బాగాలేదనే, స్పాట్లో సరిగా చూసుకోలేదనో.. ఆఖరికి కాస్ట్యూమ్స్ కలర్ నచ్చలేదని కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయడం హీరోల దర్జాగా చలామణీ అవుతోంది. దీంతో పది రూపాయల వడ్డీకి తెచ్చి సినిమాల్లో డబ్బులు పెట్టే నిర్మాతలు చితికిపోతున్నారు. అసలు సినిమా నిర్మాణానికే ఈ దుస్థితి ఉంటే.. ఇక షూట్ పూర్తయ్యాక ప్రమోషన్ల ఖర్చు.. రిలీజ్ సమయంలో ఫైనాన్షియర్లు పెట్టే లిటిగేషన్లతో నిర్మాతల దుంప తెగిపోతోంది. ఇటీవలే రెండు భారీ సినిమాలు హరి హర వీరమల్లు, అఖండ్ 2 కు రిలీజ్ చిక్కులు తప్పలేదు. హరిహర వీర మల్లు వివాదం ఆఖరి నిమిషంలో పరిష్కారమైంది. కానీ అఖండ 2 సినిమా మాత్రం నిర్మాతలు ఇష్యూ సెటిల్ చేసుకోలేకపోవడంతో.. వారం రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఇక్కడ కేవలం ఆ సినిమా బడ్జెట్లే రిలీజ్ వాయిదాకి కారణమని చెప్పలేం. నిర్మాతల పాత ఖాతాలు కూడా గుదిబండగా మారాయని చెబుతున్నారు. కారణాలు ఏవైనా అల్టిమేట్‌గా నిర్మాతలే మునిగిపోతున్నారు. ఒక్క సినిమాని అష్టకష్టాలు పడి నిర్మించిన తర్వాత.. సరిగ్గా రిలీజ్ సమయంలో లిటిగేషన్లు పెడితే.. ఓవైపు హీరోల అభిమానులకు, మరోవైపు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం కావాల్సిందే. ఇవి చాలదన్నట్టుగా ఓటీటీ, శాటిలైట్ కమిట్‌మెంట్లు ఉంటే.. వారికీ జవాబు చెప్పాల్సిందే. ఇదే అదనుగా తమ రేటు తగ్గించాలని అడిగేవారూ ఉంటారు. ఇవన్నీ పంటి బిగువన భరిస్తూ.. పైకి నవ్వుతూ కనిపించక తప్పని ఖర్మ నిర్మాతలది.
గతంలో హీరోలు ఆచితూచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు. సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకునేవారు. తాము సమయానికి రావడమే కాకుండా.. ఇతర నటీనటులు కూడా సమయానికి వచ్చేలా జాగ్రత్తపడేవారు. నిర్మాతకు డబ్బు వృథా కాకూడదనే తాపత్రయంతో పనిచేసేవారు. నిర్మాతలు సెట్లో ఉన్నా.. లేకున్నా క్రమశిక్షణతో నడుచుకునేవారు. అలాంటి అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన హీరోలతో ఇప్పటి హీరోలను పోల్చడం కూడా పాపమే. సినీ వేదికల మీద అభిమానులకు నీతులు చెప్పే హీరోలు.. షూటింగ్ స్పాట్లో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే.. అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా షూటింగ్ నిర్మాత చెప్పిన టైమ్ కో, డైరక్టర్ రెడీ అన్నప్పుడో మొదలుకావడం లేదు. క్యారవాన్ నుంచి హీరోగారు బయటకు వచ్చినప్పుడే షూటింగ్.. లేకపోతే ప్యాకప్.. ఇదీ ప్రస్తుతం తెలుగు సినిమా వర్థిల్లుతున్న తీరు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇవాళ బాగు పడిన నిర్మాత ఒక్కడు లేడు. వంద మంది నిర్మాతల్లో 98 శాతం మంది నిర్మాతలు అప్పులు పాలయ్యారు. 2 శాతం మంది మాత్రమే నిర్మాతలు…జాగ్రత్తగా గట్టెక్కిన వాళ్లు ఉన్నారు. చివరికి సినిమా రిలీజ్ ముందు…నిర్మాతల పడుతున్న కష్టాలు చూస్తే…ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. హీరోలు చేస్తున్న అరాచకం…నిర్మాతల ఆత్మహత్యల వరకు వెళ్తోంది.
హీరోలకు తోడు డైరక్టర్లు కూడా రెచ్చిపోతున్నారు. బ్రాండ్ పేరుతో నిర్మాతల్ని సెట్లో కాలుపెట్టనివ్వకుండా జులుం చేస్తున్నారు. అదేమంటే నా పనిలో వెలుపెడితే.. అవుట్‌పుట్ గురించి అడగొద్దని బెదిరిస్తున్నారు. దీంతో సినిమాపై అవగాహన లేని నిర్మాతలే కాదు.. అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న నిర్మాతలు కూడా నోర్మూసుకోవాల్సి వస్తోంది. పైగా డైరక్టర్‌ను ఏమైనా అంటే.. వెంటనే హీరో జోక్యం చేసుకుంటాడు. తమకు సింక్ బాగుందని, మధ్యలో మీరు దూరి ప్రాజెక్ట్‌ని చెడగొట్టొద్దని నిర్మొహమాటంగా చెబుతాడు. దీంతో ఏమైనా చేద్దామనుకున్న నిర్మాతలు కూడా సాహసించలేకపోతున్నారు. కళ్ల ముందే సినిమాని చెడగొడుతూ.. కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నా.. ఏమీ అనలేక తమలో తామే కుమిలిపోతున్నారు. చివరకు చేతిలో ఉన్న సినిమా ఎలాగోలా అయిందనిపించి.. ఇక జీవితంలో సినిమాలు తీయకూడదని డిసైడై.. ఇంట్లో కూర్చుంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే.. సీనియర్ నిర్మాతల పరిస్థితి మరీ దారుణం. ఎప్పుడైనా ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి ఎవరికైనా సలహాలిద్దామనుకున్నా.. అసలు తీసుకునేవారెవరూ కళ్లబటడం లేదు. అప్పటికీ ఎవరితో అయినా అతి కష్టం మీద తమ అభిప్రాయాలు పంచుకున్నా.. వృద్ధనారీ పతివ్రత అనే వెక్కిరింపులే మిగులుతున్నాయి. దీంతో వారూ నోరు తెరవటానికి ఇష్టపడటం లేదు.
ఒకప్పుడు డైరక్టర్లు నిర్మాత కంటే ఎక్కువగా బాధ్యత తీసుకుని సినిమా తీసేవారు. మొదట చెప్పిన మొత్తానికి రూపాయి ఎక్కువైనా.. నిర్మాతకు సారీ చెప్పిన డైరక్టర్లను టాలీవుడ్ చూసింది. కానీ ఇప్పుడు చెప్పిన బడ్జెట్లో సినిమా తీసే డైరక్టర్ చేతకానివాడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదే పాతిక కోట్లతో సినిమా నిర్మాణం మొదలు పెట్టి…వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. ఆ డైరక్టర్ తీస్తే ఆ మాత్రం అవుతుంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ప్రొడక్షన్ కాస్ట్ మీద ఏ మాత్రం కంట్రోల్ లేదు. వంద రూపాయలు అయ్యే ఖర్చును 5వందలు ఖర్చు చేయిస్తున్నారు. హీరో, హీరోయిన్లకు సపరేట్ క్యారవాన్లు పెడుతున్నారు. కామెడియన్లకు క్యారవాన్‌లు పెడ్తున్నారు. వీరంతా క్యారవాన్‌లో ఉంటే… అందరి ఖర్చులూ భరించే నిర్మాతలు మాత్రం టెంటులో సర్దుకోవాల్సి వస్తుంది. హీరోలకు రాచమర్యాదలు చేసే డైరక్టర్లు.. నిర్మాతకు కనీస సౌకర్యాలివ్వటానికి కూడా బడ్జెట్ చూసుకోమని అదరగొడుతున్నారు. ఇక రెమ్యూనరేషన్ కథ చెప్పాలంటే.. అదో సినీ భారతమే. ఎందుకంటే హీరోలు, డైరక్టర్లు కూడబలుక్కుని ఒకరి రెమ్యూనరేషన్లు ఒకరు పెంచుకుంటున్నారు. ఇద్దరూ ఓ మాటనుకుని.. నిర్మాతని నిండా ముంచేస్తున్నారు. నేను నీ గురించి చెబుతా.. నువ్వు నా గురించి చెప్పు అనే అవగాహనతో సినిమాలు చేస్తున్నారు. దీంతో ఉభయకుశలోపరి మాదిరిగా ఇద్దరి రెమ్యూనరేషన్లు పెరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా తమకు నచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకుంటేనే సినిమా చేస్తామనే కండిషన్ పెట్టి.. నిర్మాతని అడ్డంగా దోచేస్తున్నారు. వీరి మాయలో పడి హీరోలకు అనూహ్యంగా రెమ్యూనరేషన్ పెంచేశారు నిర్మాతలు. గట్టిగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ రాని హీరోకు వంద కోట్లు ఇస్తున్నారు. 60 శాతం బాడీ డబుల్‌తోనే షూటింగ్ చేసే హీరోకు…150 కోట్లు ఇస్తున్నారు…హీరోలకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి…మొత్తం మార్కెట్ మొత్తాన్ని నాశనం చేశారు. కొందరు డైరక్టర్లు కూడా హీరోలతో పోటీ పడి రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే కొందరు హీరోలతో అయినా రెమ్యూనరేషన్ బేర్ం చేయొచ్చేమో కానీ.. అలా చేయగలిగిన డైరక్టర్ల సంఖ్య మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే అంత కూడా లేదు. కొన్ని కొన్ని హీరో, డైరక్టర్ కాంబినేషన్లు సెట్ చేయాలంటే.. నిర్మాతలు ముందే ఆస్తులమ్ముకోవాలి. మరికొన్ని కాంబినేషన్లు సెట్ అయ్యాక చుక్కలు చూపిస్తాయి. ఇలా ఏదో ఒక దశలో హీరో, డైరక్టర్ జోడీలు నిర్మాతను వేపుకుతినటం మాత్రం ఖాయం.
ఇలా హీరో, డైరక్టర్ కలిసి నిర్మాతకు చాలా తేలికగా కళ్లకు గంతలు కడుతున్నారు. వారి డబ్బుల్ని వీరు యథేచ్ఛగా ఖర్చు పెడుతూ.. చివరకు నిర్మాతలకు.. తమ సినిమాకి పనిచేస్తున్న వారి ముఖాలు కూడా తెలియకుండా చేస్తున్నారు. కొంతమంది నిర్మాతలైతే హీరోయిన్‌ను కూడా ప్రీరిలీజ్ ఫంక్షన్లోనే చూడాల్సిన దుస్థితి. సరే ఇంతగా డామినేట్ చేస్తున్నవాళ్లు.. సినిమాకి పూర్తి బాధ్యత తీసుకుంటారా అదీ లేదు. అప్పుడు మాత్రం మాదేముంది కేవలం రెమ్యూనరేషన్ తీసుకుని మా పని మేం చేశాం అంతే అని నిర్మాతని పక్కనే పెట్టుకుని చెప్పేస్తారు. దీంతో నవ్వాలో, ఏడవాలో తెలియని దుస్థితిలో నిర్మాత కూరుకుపోతున్నాడు. హీరో వంద కోట్లు తీసుకొని…ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముందే ఇంటికి వెళ్లిపోతాడు. డైరక్టర్ సెన్సార్ రివ్యూకాగానే తన డబ్బు సర్దుకుని చెక్కేస్తాడు. అక్కడి నుంచి నిర్మాతలకు అసలు కష్టాలు మొదలవుతున్నాయి…సినిమాను రిలీజ్ చేయలేక…ఫైనాన్సియర్లకు డబ్బు కట్టలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ…వాయిదాలు వేయించుకొని…కుక్కపాట్లు పడుతున్నారు. అప్పటికి కానీ కొందరు నిర్మాతలకు తమ కళ్ల ముందే జరిగిన బాగోతం రీల్ గిర్రుమని తిరగటం లేదు. పది కోట్లతో పూర్తి కావాల్సిన సినిమాను…50 కోట్లకు పెంచేసిన సంగతి వారికి అప్పుడే గుర్తొస్తుంది. ఇప్పటికైనా హీరోలు, డైరక్టర్ల రెమ్యూనరేషన్లపై నిర్మాతలందరూ కూర్చొని…నియంత్రణ చేయకపోతే టాలీవుడ్‌లో నిర్మాతల ఆత్మహత్యలే చూస్తాం…గతంలో ఒక నిర్మాత హూసేన్ సాగర్‌లోకి దూకి…ఆత్మహత్యకు ప్రయత్నించాడు…ఆ విషయాన్ని మరచిపోకూడదు.
అలాగని తప్పంతా ఇతరులపై తోసేస్తే నిర్మాతల కష్టాలు గట్టెక్కవు. వారు కూడా బాధ్యత తీసుకోవాలి. డబ్బు పెడుతూ కూడా అంత నిర్లక్ష్యం ఏమిటని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు ఏ వ్యాపారం చేయాలన్నా.. మొదట ఆ వ్యాపారం గురించి ప్రాథమిక సూత్రాలు తెలియాలి. ఆ తర్వాతే అడుగు ముందుకేయాలి. అప్పుడే లాభాలు రాకున్నా.. నష్టాలు పలకరించకుండా ఉంటాయి. కాస్త అనుభవం వచ్చాక.. వ్యాపారంలో నలిగాక విస్తరణ గురించి.. కొత్త తరహా వ్యాపార సూత్రాల గురించి ఆలోచించాలి. అప్పుడే ఏ వ్యాపారమైనా వృద్ధిలోకి వస్తుంది. అంతేకానీ అన్నప్రాసన రోజే ఆవకాయ తింటానంటే కుదరదు. వివిధ రంగాల్లో బడా పారిశ్రామికవేత్తలుగా పేరు తెచ్చుకున్న వారంతా దశాబ్దాలపాటు ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చినవారే. టాలీవుడ్ లో కూడా పాత తరం నిర్మాతలు ఈ సూత్రాల్ని నమ్ముకునే సినిమాలు తీసేవారు. నేల విడిచి సాము చేయకుండా.. వాస్తవ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీసేవారు. అందుకే అతిగా లాభాలు కళ్లజూడకపోయినా.. నష్టాలు భరించాల్సిన దుస్థితి లేకుండా గౌరవప్రదంగా నిర్మాతలుగా సుదీర్ఘకాలం కొనసాగారు. సినిమా నిర్మాతగా గిన్నిస్ రికార్డు సృష్టించిన మూవీ మొఘల్ రామానాయుడు ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి చాలా జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు. మరి అలా ఇప్పుడు ఎందరు నిర్మాతలు ఆలోచిస్తున్నారనేది కీలకమైన ప్రశ్న.
గతంలో ఓ సినిమా తీయాలంటే కచ్చితమైన ప్లానింగ్ ఉండేది. మొదట కథ.. ఆ తర్వాత బడ్జెట్ పై ఓ నిర్ణయానికి వచ్చి.. తర్వాత షూటింగ్ కు వెళ్లాలి. కానీ ఇప్పుడు కాంబినేషన్ డేట్లు దొరికితే అంతేచాలనుకుంటున్నారు. దీంతో డైరక్టర్లు కూడా మొదట స్టోరీ లైన్ మాత్రమే చెప్పి.. తర్వాత తీరిగ్గా షూటింగ్ సెట్లో స్టోరీ రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే అయితే అప్పటికప్పుడు ఏది తోస్తే అదే. దీంతో క్వాలిటీ అనేది ముందుగానే గంగలో కలిసిపోతోంది. సరే కనీసం షూటింగ్ అయినా సరిగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అదేదో సినిమాల్లో రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అన్నట్టుగా ఉంది.. షూటింగ్ చేసే తీరు. ఏ షెడ్యూల్ అయినా అనుకున్న ప్రకారం పూర్తైతే.. నిర్మాత హమ్మయ్య అనుకోవాల్సిన దుస్థితి. భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే హీరోల దగ్గర్నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ ఎవరికీ టైమింగ్ సెన్స్ ఉండటం లేదు. ఇప్పుడు ప్రతి సినిమా సెట్ కూ నిర్మాతే ముందు రావాల్సిన పరిస్థితి. మిగతా వారంతా తీరిగ్గా వస్తున్నారు. ఎందుకు లేటైందన అని అడిగే సీన్ కూడా నిర్మాతకు లేదు. అడిగినన్ని డబ్బులివ్వాలి.. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి.. నిర్మాత పని అంతే అన్నట్టుగా ఉంది టాలీవుడ్ తీరు. ఇదంతా నిర్మాతలు ఇచ్చిన అలుసే అనేది బహిరంగ రహస్యమే.
నిర్మాతలకు సినిమాపై ప్రాథమిక అవగాహన ఉండటం లేదు కాబట్టి.. వారికి ఏ కథకు ఎంత బడ్జెట్ పెట్టాలనే విషయంపై అవగాహన ఉండదు. చాలా మంది గుడ్డిగా డైరక్టర్‌ని నమ్ముకుంటున్నారు. ముంచినా తేల్చినా నీదే భారమని సరెండర్ అవుతున్నారు. ఇంకొందరు గతంలో హిట్ అయిన సినిమా ఫార్ములాలు.. ఓటీటీలో కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్ ల టేకింగ్ ప్రామాణికం అనుకుని.. అలా వస్తే అదే పదివేలు అనుకునే బాపతు. ఇలాంటి నిర్మాతల చేతిలో టాలీవుడ్ ఎంతకాలం మనుగడ సాగిస్తుందనేది కాలమే నిర్ణయించాలి. సీరియస్ గా సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య తగ్గడం ఆందోళనకర పరిణామం. ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతల్లో చాలా మంది గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. రావడం.. రెండు, మూడు సినిమాలు తీయడం.. మళ్లీ బ్యాక్ టు ది పెవిలియన్ అనేది కొత్త ట్రెండ్ గా మారిపోయింది. కొందరు నిర్మాతలు వరుసగా సినిమాలు తీస్తున్నా.. వారు కూడా ఎంతకాలం ఇండస్ట్రీలో ఉంటారనేది వారే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సినిమా రిజల్ట్ అనేది జూదంగా మారిపోయింది. సినిమా కథ విని హిట్టా.. ఫట్టా అని చెప్పేవారు బాగా తగ్గిపోయారు. యూట్యూూబ్ లో రీల్స్, సోషల్ మీడియాలో లైకుల ఆధారంగా లెక్కలేసుకుంటున్నారు. ఎన్ని చూసుకున్నా.. అల్టిమేట్ గా థియేటర్ బుకింగ్స్ చూశాకే ఓ నిర్ణయానికి వస్తున్నారు. కొన్ని సినిమాలు అనూహ్యంగా ఆడుతున్నాయి కానీ.. అవి ఆడతాయనే సంగతి సదరు నిర్మాతలకే కాదు.. డైరక్టర్లూ, నటీనటులకు కూడా తెలియదంటే నమ్మాల్సిందే.
కళగా సినిమా మీద గౌరవం ఎలాగూ లేదు. కనీసం వ్యాపారంగా అయినా అవగాహన పెంచుకుందామని నిర్మాతలు అనుకోవడం లేదు. ఎడాపెడా తీసిపారేస్తాం.. చూడటం ప్రేక్షకుల కర్తవ్యం అనే పోకడ పెరిగింది. దీంతో ప్రేక్షకులు కూడా నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. కరోనా తర్వాత కంటెంట్ కు ప్రాధాన్యత పెరిగిందని తెలుస్తున్నా.. ఏ ధైర్యంతో నాసిరకం కథలతో సినిమాలు తీస్తున్నారు.. రొటీన్ కమర్షియల్ ఫార్ములా పట్టుకుని వేలాడుతున్నారనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఇండస్ట్రీ కళ్లు తెరవకపోతే.. సినిమా తీయటానికంటే.. రిలీజ్ కావటానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి రావచ్చు. మిథ్యా ప్రపంచంలో బతికేసే స్టార్లు.. వాస్తవంలోకి రావాలి. డైరక్టర్లు కూడా బ్రాండ్ బిల్డప్‌లు తగ్గించి నిర్మాతను గౌరవించాలి. వీరెలాపోయినా.. అంతిమంగా డబ్బులు పెట్టే నిర్మాత పూర్తి బాధ్యత తీసుకోవాలి. సీనియర్ నిర్మాతల సలహాలు తీసుకుని.. మళ్లీ స్వర్ణయుగం నాటి రోజులకు మళ్లాలి. అందుకోసం మొదట అడ్వాన్సులు అలవాటు చేసిన.. నయా నిర్మాతలను అదుపులో పెట్టాలి. రెగ్యులర్‌గా నిర్మాతలమీటింగులు పెట్టుకుని.. ఎక్కడా చిత్రనిర్మాణం కట్టు దాటకుండా జాగ్రత్తపడాలి. నిర్మాతలు అందరూ ఒక్కతాటిపై ఉంటే.. ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎంత బ్రాండ్ ఉన్న డైరక్టరైనా దిగిరాక తప్పదని గ్రహించాలి. సినిమా తీయకపోతే నిర్మాతకు బతుకులేదనే స్థితి నిజం కాదని.. నిజానికి నిర్మాతలు సినిమాలు తీయకపోతే స్టార్లు, డైరక్టర్లకే ఉపాధి ఉండదనే సంగతి తెలిసొచ్చేలా చేయాలి. అందుకోసం నిర్మాతలు హీరోలు, డైరక్టర్ల ఇంటి దగ్గర పడిగాపులు కాయటం, అడ్వాన్సులు ముట్టజెప్పటం లాంటి విలువ తక్కువ పనులు చేయకుండా.. ఆత్మాభిమానంతో వ్యవహరించాలి. కొన్నాళ్లు సినిమా తీయకపోయినా పర్లేదు కానీ.. నిర్మాతకు విలువ ఇస్తేనే సినిమాకు డబ్బులు పెడతామని తేల్చిచెప్పాలి. అప్పుడే టాలీవుడ్ బాగుపడుతుంది. ఆటోమేటిగ్గా అందరి కష్టాలు తీరతాయి. అలా కాకుండా ప్రస్తుత పోకడనే కొనసాగించుకుంటూ పోతే.. ప్రస్తుతానికి పట్టాలు మాత్రమే తప్పిన సినిమా బండి.. రాబోయే రోజుల్లో ఎవరూ ఏమీ చేయలేని దుస్థితికి దిగజారి కనుమరుగైపోవచ్చు. అంతదాకా రాకుండా నిర్మాతలే ముందు మేల్కోవాలి.
ఇకనైనా నిర్మాతలు సినిమాపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా దర్శకులు తోకాడించటానికి జంకుతారు. సబ్జెక్ట్ ఉన్న నిర్మాత దగ్గర నటీనటులు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందరూ క్రమశిక్షణ పాటిస్తే.. ఆటోమేటిగ్గా టైమ్ కు షూటింగ్ అయిపోతుంది. అనుకున్న బడ్జెట్ సరిపోతుంది. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మాత్రం.. పది కోట్ల రూపాయల బడ్జెట్.. వంద కోట్ల రూపాయలే కాదు.. ఫైనల్ కాపీ చేతికొచ్చేసరికి వెయ్యి కోట్ల రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన సినిమాల వాస్తవ మార్కెట్ ఎంతో నిర్థారించుకోవాలి. అడపాదడపా హిట్టయ్యే సినిమాల్ని కాకుండా సగటు సినిమా కలెక్షన్లను ప్రామాణికంగా తీసుకోవాలి. నిర్మాణవ్యయాన్ని అర్జెంటుగా తగ్గించాలి. హీరోల రెమ్యూనరేషన్లు కూడా భారీగా తగ్గాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ కొన్నాళ్ల పాటు మనుగడ సాగిస్తుంది. లేకపోతే మాత్రం అనగనగా కథగా మిగిలిపోతుందని సగటు సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.