Mukesh Kumar Meena: అధికారులు తప్పకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి.. తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేయాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ రోజు ఏలూరులో పర్యటించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పలు సూచనలు చేశారు.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తప్పకుండా ఎన్నికల సంఘం సూచనలను, ఆదేశాలు అమలు చేయాలన్నారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనని స్పష్టం చేశారు. ఇక, తన పర్యటనలో ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ గదులను కూడా పరిశీలించారు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.
Read Also: Young Indians: భారత్లో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ఐఎల్వో హెచ్చరిక
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ఏప్రిల్ 19 నుండి జూన్ 1వ వరకు జరిగే ఏడు దశల ఎన్నికల ప్రక్రియలో.. మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.. ఇక, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.