పార్లమెంట్‌లో (Parliament) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టకముందు పీఎం కిసాన్‌పై (PM Kisan funds) అన్నదాతలకు శుభవార్త ఉంటుందని అనేక వార్తలు షికార్లు చేశాయి. రూ.6 వేల నుంచి 9 వేల వరకు పెంచొచ్చని ఊహాగానాలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నకల ముందే కర్షకులకు గుడ్ న్యూసే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. తీరా చూస్తే అలాంటి ఊసే లేకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగిసింది. తాజాగా ఇదే అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.
పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన లేదని పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి రూ.12 వేలకు పెంచే ఉద్దేశం ఏదీ లేదని స్పష్టంచేశారు. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. పీఎం-కిసాన్ అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలియజేశారు. దీనిద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు అందిస్తున్నారు.
ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా పీఎం కిసాన్ నిధులు పెంచాలంటూ రైతులు ఎప్పట్నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్నదాతల అభ్యర్థన మేరకు మధ్యంతర బడ్జెట్‌లో పెంపు ఉండొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. తాజాగా లోక్‌సభ వేదికగా కేంద్రమంత్రి క్లారిటీ ఇవ్వడంతో అన్నదాతలకు నిరాశే ఎదురైంది.