Census Postponed : రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కింపు ఈ ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు. జనాభా లెక్కలు సేకరించే సమయంలోనే సార్వత్రిక ఎన్నికల పనుల కోసం సిబ్బందిని ఉపయోగించే అవకాశం ఉన్నందున .. ఈ ఏడాది కూడా జనాభా లెక్కలు తీసే అవకాశం లేదని అధికారులు సైతం చెబుతున్నారు. ప్రతి 10 ఏళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు జరగాల్సి ఉంటుంది. అలాగే 2011 తరువాత 2021కి సంబంధించిన సెన్సస్‌ను చేపట్టాలి. వాస్తవంగా జనాభా లెక్కలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సేకరిస్తారు. 2021కి సంబంధించిన జనగణన (సెన్సస్) 2020లో జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
అయితే 2020లో వాయిదా పడిన జనగణను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ వచ్చే ఏప్రిల్–మే మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నందున .. జనగణను చేపట్టే అవకాశం లేనట్టుగా కనపడుతోంది. ఇదే అంశాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వవర్గాలు సైతం వెల్లడించాయి. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాతనే కొత్తగా జనాభా లెక్కలు చేపట్టే అవకాశం ఉంది.
ఈ సారి సెన్సస్ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా డిజిటల్ సెన్సస్‌గా నిలవనున్నాయి. పౌరులు సొంతంగా వివరాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం స్వీయగణన పోర్టల్‌ను సెన్సస్ యంత్రాంగం రూపొందించింది. ఇందులో ప్రజలు ఆధార్ లేదా మొబైల్ నంబరును అందించాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్ వివరాలు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఉపయోగించే ప్రధాన ఆహారంవంటి 31 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించనున్నారని అధికారులు స్పష్టం చేశారు. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సెన్సస్ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి మూలంగా అది కాస్త వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. పాలనపరమైన పరిధులు, కొత్త జిల్లాల లెక్కలవంటి వాటిపై తుది నిర్ణయానికి వచ్చే తేదీని ఈ ఏడాది జూన్30గా రిజిస్ట్రార్ జనరల్–సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం జనవరిలో స్పష్టం చేసింది. సాధారణంగా ఆ తేదీని ప్రకటించిన మూడు నెలలకు గానీ సెన్సస్‌ను ప్రారంభించటం కుదరదు. అంటే అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ జనగణన సాధ్యం కాదు. ఆ తర్వాత జనగణన నిర్వహించే 30లక్షలమంది ఉద్యోగుల శిక్షణకు కనీసం మరో రెండు లేదా మూడు నెలల కాలం పడుతుంది. ఆ సమయానికి సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం(ఈసీ)ప్రక్రియ మొదలైపోతుంది. ఈ ఏడాది అక్టోబరు నుంచి సిబ్బందికి ఈసీ పనుల కారణంగా జనగణనపై ప్రభుత్వం దృష్టిపెట్టడం కష్టం. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు జనాభా లెక్కలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.