CEC Rajiv Kumar: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈసీ సమావేశాలు, సమీక్షలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఈసీ రాజీవ్‌కుమార్ ఓటర్ల విజ్ఞప్తి చేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలను కలిశామని, వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియ పాల్గొనకుండా చూడాలని ఒక పార్టీ కోరిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఒక ఇంటి నెంబర్‌తో ఎక్కువ సంఖ్యలో ఓటర్ల నమోదుపై కూడా ఫిర్యాదు వచ్చిందన్నారు. వీటిపై ఈసీ డోర్ టు డో క్యాంపైన్ చేపట్టామన్నారు. 4.52 లక్షల ఓటర్లలో 26,679 ఓటర్లు ఆచూకీ దొరకలేదన్నారు. మోడల్, మహిళా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Read Also: Group 2: ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు ఊరట.. దరఖాస్తు గడువు పొడిగింపు
సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఈసీ ఓటర్లకు సదుపాయం కల్పిస్తామన్నారు. పోలింగ్ సమయంలో ఫిర్యాదుల పరిష్కారం కోసం సీ విజిల్ యాప్ ను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఎవరైనా ఈ యాప్ వేదికగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కూడా ఓటర్లకు వివరాలు అందించటానికి ఉపయోగపడుతుందన్నారు. కేవైసీ యాప్..ఈ యాప్ ద్వారా మీ అభ్యర్థిని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థి నేపథ్యం, కేసులు, ఆస్తులు వంటి అన్ని వివరాలు తెలుసుకునే సౌలభ్యం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 139 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు కఠినంగా వ్యవహరిస్తాయన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించటానికి ఈసీ పూర్తి నిఘా పెడుతోందన్నారు. ఓటర్లను మభ్య పెట్టే అన్ని ప్రయత్నాలు, చీరలు, వస్తువుల, డబ్బు పంపిణీ పై పూర్తి నిఘా ఉంటుందన్నారు. ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరైనా పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: Breaking: వైసీపీకి మరో షాక్.. కర్నూల్ ఎంపీ రాజీనామా
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2022 జనవరి నాటికి జరిగిన ఓటర్ల నమోదు, తీసివేతలకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ పార్టీలకు అందించామన్నారు. రాష్ట్రంలో ఓటింగ్ పర్సెంటేజ్ బాగుంటుందని.. మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు తమ పై ఉన్న కేసులను పత్రికా ముఖంగా ప్రకటించాల్సి ఉంటుందని.. మూడు పత్రికల్లో ప్రకటన చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్న ఆయన.. వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామన్నారు.