ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ స్వాతి మలివాల్‌ను కొట్టిన కేసు ఇప్పుడు ఊపందుకుంది. అంతకుముందు స్వాతితో బిభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించాడని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించగా.. శుక్రవారం ఆప్ యూటర్న్ తీసుకుంది. స్వాతిపై వచ్చిన ఆరోపణలకు దూరంగా ఉండి ఆమెను బీజేపీ మద్దతుదారుగా పేర్కొంది. తాజాగా పోలీసులు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీఎం ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
READ MORE: Swati Maliwal : స్వాతి మలివాల్‌పై విభవ్ కుమార్ ఫిర్యాదు… సంచలన ఆరోపణలు
కాగా.. వీటన్నింటి మధ్య స్వాతి సీసీటీవీలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేశారు. ‘ఇప్పుడు కొంత మంది ఇంట్లోని సీసీటీవీలను ట్యాంపరింగ్ చేస్తున్నారని నాకు సమాచారం అందింది..’ అని స్వాతి రాసుకొచ్చారు. ఇంతకుముందు కేజ్రీవాల్ ఫోటోను డీపీగా పెట్టుకున్న ఆమె ప్రస్తుతం ఆ ఫొటోను తీసేశారు. కాగా.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు శుక్రవారం సీఎం ఇంటికి చేరుకుని సన్నివేశాన్ని రీ క్రియోట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 4:40 గంటలకు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం విచారణ కోసం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంది. ఢిల్లీ పోలీసుల బృందం కూడా 6:23 గంటలకు స్వాతి మలివాల్‌తో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంది. సుమారు అరగంట తర్వాత 7:05 గంటలకు స్వాతి మలివాల్ సీఎం నివాసం నుంచి బయటకు వచ్చారు. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కొన్ని సీసీ కెమెరాల డాతాను పెన్ డ్రైవ్‌లో తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు ఈ ఉదయం మళ్లీ సీఎం నివాసానికి వెళ్లే అవకాశం ఉంది.