సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులకు బోర్డు హెచ్చరికలు (Warning) జారీ చేసింది. పరీక్షలు ప్రారంభమవుతున్న వేళ సోషల్ మీడియాలో సీబీఎస్‌ఈ లోగో పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే హ్యాండిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు, టీచర్లకు (Students And Teachers) సూచించింది .
ఈనెల 15 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో సీబీఎస్‌ఈ పేరుతో తప్పుడు సమాచారం జరుగుతున్నట్లుగా బోర్డు గుర్తించింది. దీంతో ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తమ బోర్డు పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరింది.
‘@cbseindia29’ హ్యాండిల్ మాత్రమే తమదని.. దీంట్లో వచ్చిన సమాచారం మాత్రమే అధికారికమని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని కోరింది. ఈ సందర్భంగా 30 నకిలీ ఖాతాల జాబితాను విడుదల చేసింది. బోర్డు పేరు, లోగో పెట్టుకొని ఈ హ్యాండిల్స్ నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని.. విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నకిలీ ఖాతాల్లో వచ్చిన సమాచారానికి తమది బాధ్యత కాదని స్పష్టం చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫిబ్రవరి 15 నుంచి 10, 12 తరగతులకు 2024 బోర్డు పరీక్షలను ప్రారంభం కాబోతున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు జరగనున్నాయి. అయితే 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు నిర్వహించబడతాయి.
ఇదిలా ఉంటే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధుమేహం ఉన్నవారికి కొన్ని వెసులుబాటులు కల్పించింది. పరీక్ష హాల్‌లోకి మందులు, నీళ్లు.. వగేరా వస్తువులు తీసికెళ్లేందుకు బోర్డు పర్మిషన్ కల్పించింది. అయితే ముందుగా ఎగ్జామ్ హాల్ సెంటర్‌కు వెళ్లి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది.