Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌రావును లోతుగా విచారిస్తే కేసులో కీలకమైన అంశాలు, రాజకీయ ప్రముఖుల పాత్ర తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. భారీ ముడుపులు చేతులు మారిన వ్యవహారంలో అభిషేక్ కీలకం అని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు గల రాజకీయ సంబంధాలు ఈ కేసులో అత్యంత కీలకమని, వీటిపై సమగ్ర సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. న్యాయస్థానం అనుమతితో అభిషేక్ రావును కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది.
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. అరెస్ట్‌లు, దాడులతో స్కాంలో హస్తం ఉన్నవారి గుండెల్లో సీబీఐ రైళ్లు పరుగెట్టిస్తోంది. ఇప్పటికే విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవాపం ఢిల్లీలో అభిషేక్‌రావును సీబీఐ విచారించింది. మంగళవారం అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచింది. కీలక విషయాలు రాబట్టాలని.. అందుకోసం 5 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరింది. దీంతో 3 రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతించింది. అభిషేక్‌ను రెండవ రోజు విచారించిన అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్‌రావుకు సంబంధించిన కీలక విషయాలు సీబీఐ కస్టడీ రిపోర్టులో వెల్లడించాయి. అభిషేక్‌రావును 8సార్లు పిలిచి ప్రశ్నించిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఆయనకు లింకులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌రావుది కీలకపాత్రని తేల్చింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో కొందరు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక సమాచార నివేదికలో 16 మంది ప్రమేయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో అరుణ్ రామచంద్రన్ పిళ్ళైని నిందితుడిగా చేర్చింది. అభిషేక్‌తో పాటు పిళ్ళై కూడా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌గా ఉన్నారు.
Siddipet : సిద్దిపేట జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు
లిక్కర్ స్కాంలో కీలకమైన వ్యక్తులు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లో సమావేశమవ్వడం, ఇందులో అభిషేక్ కూడా పాల్గొనడంతో స్కామ్‌తో అభిషేక్‌కు ఉన్న లింకులేమిటో తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. వ్యాపార, రాజకీయ ప్రముఖుల పాత్రపై సీబీఐ ఆరా తీస్తోంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ సమావేశాలపై ప్రశ్నలు సంధిస్తోంది. మనీష్ సిసోడియా అనుచరుడు అర్జున్ పాండే , విజయ్ నాయర్, సమీర్ మహేంద్రలతో అభిషేక్ సంబంధాలపై ఈడీ ఆరా తీస్తుండగా… రాబిన్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపార వ్యవహారాలు, భాగస్వాములపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. డాక్యుమెంట్లు ముందుంచి సీబీఐ ప్రశ్నిస్తోంది. హవాలా మార్గంలో భారీగా నగదు చేతులు మారినట్టు గుర్తించింది. అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తుల వివరాలను సీబీఐ సేకరిస్తోంది.