కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు.
మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసి సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. నిన్న రాజమండ్రి నుంచి విశాఖపట్నంలో మీటింగ్ కి వెళ్లి, అనంతరం తిరిగి రాజమండ్రికి వెళ్తుండగా అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ ఆత్మీయులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.