Cameroon Elections 2025: ఓ దేశానికి 92 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి దేశాధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందని ఆశ్చర్యపోతున్నారా.. సోమవారం కామెరూన్ దేశంలో జరిగింది. ఆ దేశ రాజ్యాంగ మండలి ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో 92 ఏళ్ల పాల్ బియాను విజేతగా ప్రకటించింది. 92 ఏళ్ల బియా 1982 నుంచి దేశాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజ్యాంగ మండలి నివేదికల ప్రకారం.. అక్టోబర్ 2న జరిగిన ఎన్నికల్లో బియాకు 53.66% ఓట్లు లభించగా, ఆయన ప్రత్యర్థి ఇస్సా చిరోమా బకారీకి 35.19% ఓట్లు వచ్చాయి.
READ ALSO: Impact Player Of The Series: రోహిత్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు.. ప్రపంచ కప్ లక్ష్యంగా..?
1982 నుంచి అధ్యక్షుడిగా..
1960లో కామెరూన్ దేశం స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచి దేశంలో కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే అధికారంలో ఉన్నారు. గతంలో దేశాధ్యక్షుడిగా పని చేసిన అహ్మదు అహిద్జో రాజీనామా తర్వాత 1982లో బియా దేశాధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఆయనే దేశంలో అధికారంలో ఉన్నారు. కేవలం పాల్ బియా మాత్రమే గత 43 సంవత్సరాలుగా దేశాన్ని పాలించారు. తాజాగా మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మరో ఏడు ఏళ్ల పాటు అధికారంలో ఉండనున్నారు. ఆయన పదవీకాలం ఆయనకు 99 ఏళ్ల వయస్సులో ముగియనుంది.
దేశ జనాభాలో 43% పేదలు..
కామెరూన్ దేశంలో దాదాపు 3 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. కామెరూన్ జనాభాలో 43% ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. దేశంలో మూడవ వంతు మంది ప్రజల రోజువారి ఆదాయం $2 కంటే తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 8 మిలియన్ల మంది ఓటు వేయడానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో 34 వేల మందికిపైగా విదేశాలలో నివసిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఒక రోజు ముందు దేశంలో నిరసనలు చెలరేగాయి. డౌలా నగరంలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణల్లో నలుగురు నిరసనకారులు మరణించారు. అలాగే సుమారుగా 100 మందికి పైగా నిరసనకారలను అరెస్టు చేశారు. వాస్తవానికి దేశంలో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి, ప్రభుత్వం ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిందని నిరసన తెలిపారు. అయితే భద్రతా దళాలు టియర్ గ్యాస్ ఉపయోగించి నిరసనకారులను చెదరగొట్టాయి. మరౌవా, గరోవా వంటి ఇతర నగరాల్లో కూడా నిరసనలు చెలరేగాయి.
బియా బహిరంగంగా కనిపించడానికి చాలా తక్కువగా ఇష్టపడతారు. ఆయన ఈ ఎన్నికల్లో కేవలం ఒక్కసారి మాత్రమే మరౌవా పట్టణంలో ప్రచారం చేశారు. బియా ప్రత్యర్థి ఇస్సా చిరోమా బకారీ ఎన్నికలకు ముందే విజయం సాధించినట్లు ప్రకటించారు. చిరోమా బకారీ మాట్లాడుతూ.. తన మద్దతుదారులు ఓట్లను లెక్కించారని, ఈ ఎన్నికల్లో తాను విజయం సాధించినట్లు చెప్పారు. కానీ బియా ఈ వాదనను తిరస్కరించారని వెల్లడించారు. ప్రతిపక్షాలు, యువత మాట్లాడుతూ.. చిరోమాను బకారీని ఓడించడానికి బియా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని చెబుతున్నారు.
READ ALSO: South Korea Protests: చైనాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో నిరసనలు.. హెచ్చరించిన అధ్యక్షుడు!