Business Headlines 07-03-23:
పేటీఏం-ఏపీ ఒప్పందం
పేటీఎం సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఆరోగ్యం మరియు సైబర్ భద్రత వంటి రంగాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల నుంచి మరియు వ్యాపార సంస్థల నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తాయి. టోల్ ప్లాజాలు సైతం ఈ ఆన్‌లైన్ పేమెంట్లను తీసుకుంటాయి. ఈ మేరకు పేటీఎం సంస్థ ఒక ప్రకటన చేసింది.
మళ్లీ స్టీల్ బిజినెస్‌లోకి..
ఎస్సార్ గ్రూప్ మళ్లీ స్టీల్ బిజినెస్‌లోకి ఘనంగా ప్రవేశిస్తోంది. ఈ మేరకు రానున్న మూడు నాలుగేళ్లలో దేశవిదేశాల్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా మూడు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. సౌదీ అరేబియాలో ఒక స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తోంది. ఒడిశాతోపాటు అమెరికాలో కూడా ఐరన్ పెల్లెట్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మూడు ప్రాజెక్టుల కోసం ఏకంగా 8 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టనుంది.
హోలీకి స్పెషల్ ట్రైన్లు
హోలీ సందర్భంగా భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 196 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు 491 ట్రిప్పులు తిరగనున్నాయి. పండుగ సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేసింది. ఈ రైళ్లు ప్రధాన రైల్వే స్టేషన్ల మధ్య ప్యాసింజర్లను గమ్య స్థానాలకు చేర్చనున్నాయి. ప్రయాణికుల రద్దీని నియంత్రించటానికి మరియు వాళ్లకు భద్రత కల్పించటానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయం కూడా తీసుకోనుంది.
ఆస్ట్రేలియాలో అదానీ..
గౌతమ్ అదానీ ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ముఖ్యమైన ఇన్వెస్టరేనని ఆ దేశ హైకమిషనల్ బ్యారీ ఓ ఫారెల్ చెప్పారు. అదానీ గ్రూపు పెట్టుబడుల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఆస్ట్రేలియాలో అదానీ వ్యాపారాలు ప్రభావితమైనట్లు తనకు నివేదికలు ఏమీ రాలేదని అన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల గ్లోబల్ మార్కెట్‌లో అదానీ బిజినెస్‌లు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా హైకమిషనరల్ పాజిటివ్‌గా స్పందించటం చెప్పుకోదగ్గ విషయం.
‘సార్’కి రూ.100 కోట్లు
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ సినిమా.. వాతి.. వరల్డ్‌వైడ్‌గా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. నిన్న సోమవారం నాటికి తమిళంలో 37 పాయింట్ ఒకటీ ఆరు కోట్లు, తెలుగులో 30 పాయింట్ మూడు ఒకటి కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో మన దేశంలో మొత్తం 67 పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి. వాతి మూవీని తెలుగులో ‘సార్’ అనే పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజైన కేవలం 17 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరటం విశేషం.
డైలీ 27 కోట్ల లావాదేవీలు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రోజూ యావరేజ్‌గా 27 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. మొత్తం డిజిటల్ పేమెంట్లలో యూపీఐ చెల్లింపుల షేరు 75 శాతానికి చేరినట్లు తెలిపారు. విలువ పరంగా చూస్తే.. ఫిబ్రవరి లావాదేవీల వ్యాల్యూ 12 పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయలని వివరించారు. గడచిన మూడు నెలలుగా ప్రతి నెలా కనీసం వెయ్యి కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని చెప్పారు.