Tamilnadu: తమిళనాడులో జరిగిన ఓ ఘటన సంచలనం రేపుతోంది. క్షుద్ర పూజల కోసం ఓ మాంత్రికుడు బాలిక తలను తీసుకెళ్లాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం గ్రామంలో చోటుచేసుకుంది. అక్టోబర్ 25న మంగళవారం ఈ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. మధురాంతకం గ్రామంలో వారం రోజుల క్రితం మృతి చెందిన బాలిక మృతదేహం సమాధి నుంచి చోరీకి గురైంది. 6వ తరగతి చదువుతున్న కృతిక అనే బాలిక అక్టోబరు 5న తీవ్రంగా గాయపడింది. ఆమె ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో విద్యుత్ స్తంభం ఆమెపై పడి తలకు బలమైన గాయమైంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన కృతిక అక్టోబర్ 14న కన్నుమూసింది. అక్టోబరు 15న కుటుంబసభ్యులు ఆమెకు అంత్యక్రియలు చేశారు. శ్మశానవాటికలో వారి కుమార్తె మృతదేహాన్ని ఖననం చేశారు. పది రోజుల తర్వాత మంగళవారం ఉదయం స్థానికులు స్మశానవాటిక గుండా వెళుతున్నప్పుడు, సమాధిని ధ్వంసం చేసి, ముక్కలు చేసిన నిమ్మకాయలు, పసుపుతో అక్కడ ఉండటం చూసి భయపడిపోయారు.
వారి వెంటనే కీర్తిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెళ్లి చూడడంతో అక్కడ తమ కుమార్తె సమాధిని తవ్వి ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు సమాధిని తెరిచిచూశారు. సమాధిలో బాలిక తల కనిపించకుండాపోవడంతో వారు దిగ్భ్రాంతి చెందారు. మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత మృతదేహం నుంచి తలను ఎవరో తొలగించినట్లు నిర్ధారించారు. ఈనెల 25న అమావాస్య నేపథ్యంలో శ్మశానంలో ఓ మాంత్రికుడు క్షుద్ర పూజలు చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఖననం చేసి ఉన్న బాలిక తల నరికి తలను తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపడుతున్నారు.