జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండని.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మిన మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగిందని.. పది శాతం పెరగాల్సిన ఆదాయం మూడు శాతం ఎలా ఉంది.. ఎవరి చేతిలోకి ఆదాయం వెళ్తుందని ప్రశ్నించారు. మీరు చేస్తే సంపద సృష్టి అని.. మేము చేస్తే తప్పా అని బుగ్గన మండిపడ్డారు.
‘బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. రూ.5750 కోట్ల అప్పును బాండ్స్ అమ్మి తీసుకోబోతున్నారు. మేము సంక్షేమం కోసం అప్పు తీసుకుంటే.. రచ్చ చేశారు. ఎన్నికల ముందు మా ప్రభుత్వంపై విచ్చలవిడిగా ప్రచారం చేశారు. అప్పు మీది ఖర్చు మాది అని నోటికి వచ్చింది రాశారు, మాట్లాడారు. మీరు చేస్తే సంపద సృష్టి, మేము చేస్తే తప్పా.. మీది ఒప్పు, మాది తప్పు అంటారా?. కనీసం ఎక్సైజ్ శాఖ ఇచ్చిన GO కనిపించడం లేదు. GO లేకుండా అప్పులు ఎలా తీకుంటున్నారు. భారత దేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఫ్రాడ్ చూడలేదు. స్పెషల్ మార్జిన్ గురించి మాట్లాడారు.. స్పెషల్ మార్జిన్ మీరు ఇవ్వలేదా. ఈ బాండ్స్ కు రూ.200 కోట్లు స్పెషల్ కమీషన్ ఇవ్వడంలేదా.. బయటకు వచ్చి చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసి.. ప్రైవేటు వ్యక్తుల ఆదాయం తెచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేశాం. ప్రైవేట్ వ్యక్తులకు పోయే పన్నును.. ప్రజల సంక్షేమం కోసం పెట్టాం. మీరు వైట్ పేపర్ అంటే ఇష్టం కదా.. మీరు తెచ్చిన అప్పు మీద వైట్ పేపర్ బయటపెట్టండి’ అని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు.
’40 ఏళ్ల చరిత్ర.. డెబ్భై ఏళ్ల వయస్సు ఉన్న మీరు ఎందుకు ఫ్రాడ్ చేస్తున్నారు చెప్పండి. పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతారు. అమరావతి అని చెప్పి కిలోమీటర్కు అరవై కోట్ల కాంట్రాక్ట్స్ జరుగుతున్నాయి. అంత కష్టపడి పేద వాళ్ళ కోసం మెడికల్ కాలేజీలు కడితే.. పీపీపీ మోడల్లో ప్రైవేట్ కు కట్టబెడుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడు ఎందుకు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుంది. ఇంత మద్యం అమ్మినా మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగింది. పదిశాతం పెరగాల్సిన ఆదాయం మూడు శాతం ఎలా ఉంది.. ఎవరి చేతిలోకి ఆదాయం వెళ్తుంది.120లకు అమ్మితే నాసిరకం.. 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుందా?. ఊరు పేరు తెలియని బ్రాండ్స్ అన్ని వచ్చాయి’ అని బుగ్గన ఫైర్ అయ్యారు.