Site icon NTV Telugu

KTR: కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

Ktr

Ktr

KTR: వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్‌లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానమని కేటీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారని.. చిత్తశుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్‌కు లెటర్ రాయాలని, తాము కూడా ఉత్తరం రాస్తామన్నారు. కరువు వస్తే మమ్ములను తిడుతారా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని.. కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ ఆయన ఆరోపించారు. మేడిగడ్డ నుంచి రోజూ 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రిపేరు చేయకుండా కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారన్నారు.

Read Also: Mission Bhagiratha: మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ భేటీ

కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలనకు వెళితే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేరు చేస్తే తెలంగాణలో కరువు రానే రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. రైతుల హక్కుల తరపున కొట్లాడుదామని ఆయన బీఆర్‌ఎస్‌ నేతలకు, రైతులకు పిలుపునిచ్చారు. ప్రజలకు మొండి చేయి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు అని ప్రజలకు వివరించి చెబుతామన్నారు. రేపటి నుండి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్‌పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని కేటీఆర్‌ రైతులకు సూచించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నామని ఆయన ప్రశ్నించారు. నేతన్నల కొరకు తాము పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గుంపుమేస్త్రీ, ప్రధానమంత్రి తాపీమేస్త్రీ అంటూ విమర్శించారు.

 

Exit mobile version