Mission Bhagiratha: మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్తితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని, అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం ఈ శాఖ బాధ్యత అని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు. పంపు సెట్‌లలో లేదా పైప్‌లైన్‌లో లేదా విద్యుత్ సరఫరాలో ఏదైనా చిన్న మరమ్మతులు కానీ వైఫల్యం కానీ సంభవించినట్లైతే కొన్ని ఆవాసాలకు సరఫరా ఇబ్బంది కలిగే అవకాశముందన్నారు.గృహాలకు నిరవధికంగా, 100 శాతం సరఫరా చేయడానికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమైనదని, చాలా కీలకమని గుర్తు చేశారు.
Read Also: Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో..
అన్ని పంపు సెట్ల మరమ్మతులను ఏప్రిల్ 12 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ విషయంలో పంప్ సెట్స్ ఏజెన్సీలు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, సంబంధిత చీఫ్ ఇంజనీర్‌లకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఏజెన్సీలు పంపుసెట్స్‌కు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పైప్‌లైన్ మరమ్మతులన్నింటిని 12 గంటల్లో చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ అండ్ ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఏజెన్సీలకు నిర్దేశించారు. డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన సమయానికి తాము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని, ప్రస్తుతం ఉన్న మరమ్మతులకు, భవిష్యత్తులో జరిగే మరమ్మతులకు సానుకూలంగా హాజరవుతామని ఏజెన్సీలు హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యాత్మక ఇళ్లను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజూ నీటి సరఫరా అయ్యేటట్టు చూడాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్లును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించడం జరిగిందని ఆయన వెల్లడించారు.