BRS Protest: గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Ktr (1)

Ktr (1)

BRS Protest: హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని దేవుడి ముందు కాంగ్రెస్‌ నేతలు అఫిడవిట్లు పెట్టారని, కానీ.. 100 రోజులు అని చెప్పి ఇప్పుడు 1000 రోజులు గడిచినా హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

1000 రోజుల పాలనలో హామీలను ఎందుకు అమలు చేయలేదో అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని తమ పార్టీ అధినేత కేసీఆర్‌ సూచించారని కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏమిటో కూడా అసెంబ్లీలో అడుగుతామని చెప్పారు.

రైతులకు ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరు అర్థమైందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహిళలు, యువత, విద్యార్థుల తరఫున బీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో ప్రశ్నిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నాలుగు రోజులు మాత్రమే సభ నిర్వహించి తూతూమంత్రంగా ముగిస్తే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. తాను ఇలాంటి విమర్శలు ఎన్నో చూశానని, అయితే ప్రజల తరఫున అసెంబ్లీలో బలంగా పోరాడాలని కేసీఆర్‌ తమకు సూచించారని తెలిపారు.

22Aపై అసెంబ్లీలో చర్చించాలి: ఎమ్మెల్యే సంజయ్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ మాట్లాడుతూ.. 22ఏ నిబంధన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 22A ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో ప్రభుత్వం ప్రజలకు, అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని కోరారు.

ప్రభుత్వ భూములను ఎందుకు విక్రయిస్తున్నారో ప్రజలకు వివరించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకే ప్రజలు తమను అసెంబ్లీకి పంపించారని, అయితే అసెంబ్లీలో తమ మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అజెండా కోసమే అసెంబ్లీని నడుపుతున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మార్షల్స్‌ను ఏర్పాటు చేసి తమను అడ్డుకుంటున్నారని సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ఈసారి కనీసం నెల రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.