KCR: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తీసుకునేలా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు (ఫిబ్రవరి 19) జరగనుంది. ఈ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన వహించనున్నారు. గత ఆరు నెలలుగా తెలంగాణ భవన్‌కు రాకపోయిన కేసీఆర్, నేడు భవన్‌కు రానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నేతృత్వంలో కీలక చర్చలు జరగనున్నాయి.
Also Read: Supreme Court: సీఈసీ నియామకంపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ
ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు సహా మొత్తం 400 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పార్టీ స్థాపన దినోత్సవమైన ఏప్రిల్ 27న ప్రతినిధుల సభ నిర్వహించేందుకు యోచిస్తున్నారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే, పార్టీ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పార్టీ క్యాడర్‌ను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కేసీఆర్ వ్యూహ రచన చేయనున్నారు. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read: kulli: రజినీకాంత్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్..
సెప్టెంబర్-అక్టోబర్‌లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ లోతుగా సమీక్షించనుంది. ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా, లగిచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలు, రైతు ఆత్మహత్యలు, ఆటో కార్మికుల సమస్యలు వంటి అంశాలపై అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయనుంది. బీఆర్ఎస్ ఈ సమావేశంతో తన కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని యోచిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, కార్యకర్తలకు కొత్త దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సమావేశ ఫలితాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.