బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతలు చేసిన నిరసనల్లో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కరెంట్ లేదని వ్యాఖ్యానించారు. దయనీయ పరిస్థితిలో కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, కమ్యూనిటీస్ స్టోరేజ్ కింద కల్లాలను నిర్మించామని, 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చామన్నారు. జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన డబ్బులలో 150 కోట్లను రికవరీ చేశారని, కేంద్రం డబ్బులు రికవరీ చేయడంపై నిరసనగానే ధర్నా చేశామన్నారు. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్‌లు, ఫైన్ లు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందని, కేసీఆర్ ముందు చూపుతో కల్లాలు నిర్మిస్తే రికవరీ చేశారని, సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలన్నారు. ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం గొంతు నొక్కి చంపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలని చైతన్య పరచడానికే బీఆర్ఎస్ పెట్టామని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Bajrang Dal: “లవ్ జిహాద్” కోసం పబ్బులను వినియోగిస్తున్నారు.. న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలి.
ఇదిలా ఉంటే.. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చౌరస్తా సెంటర్ లో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతువ్యతిరేక విధానాలకు నిరసనగా వినూత్న రీతిలో రైతులకు, రైతు కూలీలకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులతో కలిసి ఉరితాళ్లతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులకు మంచి చేస్తే ఓర్వని కేంద్ర బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పంట కల్లాలు కడితే, ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.