krishank Manne: హైదరాబాద్ కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని భూ వివాదంతో పాటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంశంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై AI ఆధారంగా తప్పుడు పోస్టులు చేశారనే అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 9, 10, 11 తేదీలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరుకావాలని కోరుతూ నోటీసులు అందజేశారు.
Read Also: IPL 2025: నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే: ఊర్వశి రౌతేలా
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నేను ఎక్కడా AI ఉపయోగించలేదని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ వాస్తవమేనని తెలిపారు. ఆ ప్రాంతంలోని జింకలు రోడ్లపైకి వచ్చాయని.. అందులో కొన్ని ఇళ్లలోకి వెళ్లిన దృశ్యాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవన్నీ ప్రజలే తీసిన వీడియోలేనని, తాము చట్టబద్ధంగా ఈ నోటీసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు క్రిశాంక్.
HCU భూములపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇది ఆందోళనకరం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. ఫేక్ న్యూస్‌పై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పుడు పోలీసుల నుంచి నోటీసులు వెళ్లడం, రాజకీయ నేతలపై ఆరోపణలు వెలువడటంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.