బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానం పలికారు. నేడు స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనమిది మంది మృతి!
అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండవ రోజే కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స చేశారు. తుంటి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో కర్ర సహాయంతో కేసీఆర్ మెల్లిగా నడుస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన చేశారు. కానీ ఈ సారి మాత్రం కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కాబోతున్నారు.