అకాడమీ అవార్డు విజేత బ్రాడ్ పిట్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిశాడు. బ్రాడ్ పిట్ నటించిన యాక్షన్, కామెడీ చిత్రం ‘బుల్లెట్ ట్రైన్’ ఆగస్ట్ 5న విడుదలైంది. మరోసారి తన యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు బ్రాడ్. దాదాపు మూడు సంవత్సరాల క్రితం హాలీవుడ్ లో లియోనార్డో డికాప్రియోతో కలసి క్వింటిన్ టారంటినో సినిమా ‘వన్స్ అప్ ఆన్ ఎ టైమ్’ సినిమాలో సందడి చేశాడు బ్రాడ్ పిట్. అంతకు ముందు ట్రాయ్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ సినిమాలలో మాజీ భార్య ఏంజెలీనా జోలీ తో నటించాడు. బ్రాడ్ పిట్ పేరు వినగానే ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, టరాన్టినోస్ ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్, మనీబాల్, ఓషన్స్ ట్రయాలజీ – ఓషన్స్ ఎలెవెన్, ట్వెల్వ్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ చిత్రాల గుర్తుకు వస్తాయి.
తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు బ్రాడ్ పిట్. అమెరికన్ అసాసిన్ లేడీబగ్ గా బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాలో జోయ్ కింగ్, ఆరాన్ టైలర్ జాన్సన్, బ్రెయిన్ ట్రీ హెన్రీ, ఆండ్రూ కోజీ, సాండ్రాబుల్లక్ ఇతర పాత్రలను పోషించారు. కొలంబియా పిక్చర్ నిర్మించిన ఈ సినిమాకు ‘డెడ్‌పూల్ 2’ దర్శకుడు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించాడు.