Botsa Satyanarayana: ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్ ప్రజలపై పడకూడదని ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జగన్‌ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైన దిగజారతాడని విమర్శించారు. చంద్రబాబు ఆడిన అబద్ధాలను నిజం చేయడానికి పడుతున్న తపన చూస్తుంటే జాలి వేస్తుందన్నారు.
Read Also: AP CM Chandrababu: జగన్ అబద్ధపు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి..
మీ ఆరోపణ నిజమైతే సీబీఐ విచారణ వేయమని కేంద్రానికి లెటర్ రాయాలని పేర్కొన్నారు. మీకు దమ్ము, ధైర్యం వుంటే కమిటీ వేయమని హైకోర్టులో అఫిడవిట్ వేయాలన్నారు. రాజకీయాల కోసం ఇలాంటి నీచ ఆలోచనలు ఎలా చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌లో 4వేల ఉద్యోగాలు తీసే పరిస్థితి వచ్చిందని.. దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటానికి అడుగులు వేయడం మానేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఈ 100 రోజుల్లో 27వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని.. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు సృష్టిస్తున్నారన్నారు. ప్రజలకు అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలు ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయాలన్నారు. సీబీఐ గాని, హైకోర్టు గాని, సుప్రీంకోర్టు గాని ఎంక్వైరీ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు దమ్ముంటే నిరూపించాలని బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు.