ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రసిద్ధ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో పడవ బోల్తా పడటంతో 65 మంది గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. జావాకు చెందిన ఏజెన్సీ ఫెర్రీ మానిఫెస్ట్ డేటా ప్రకారం పడవలో మొత్తం 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా నుంచి ప్రసిద్ధ గమ్యస్థానానికి వెళుతుండగా బుధవారం రాత్రి 11:20 గంటలకు (1520 GMT) బాలి జలసంధిలో ఫెర్రీ మునిగిపోయిందని సురబయ శోధన, రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్గెస్ట్ డిజాస్టర్
గురువారం ఉదయం నలుగురిని రక్షించినట్లు ఏజెన్సీ తరువాత ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సమయం 11:20 గంటలకు మునిగిపోయిన పడవలో 14 ట్రక్కులు సహా 22 వాహనాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆగ్నేయాసియాలోని దాదాపు 17,000 దీవులతో కూడిన ద్వీపసమూహం అయిన ఇండోనేషియాలో సముద్ర ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. దీనికి కారణం భద్రతా ప్రమాణాలు లోపించడం. మార్చిలో, బాలి తీరంలో 16 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఆస్ట్రేలియన్ మహిళ మరణించింది.