ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత్‌లో తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం పెంచినట్లు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు.
దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 3 సిరీస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ ఎం340ఐ మోడళ్ల ధరలను పెంచుతోంది. అంతేకాదు దిగుమతి చేసుకునే బీఎండబ్ల్యూ ఐ4, బీఎండబ్ల్యూ ఐ5, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ7 ఎం70, బీఎండబ్ల్యూ ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, బీఎండబ్ల్యూ జడ్4 ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎం2 కూపే, బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్, బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్, బీఎండబ్ల్యూ ఎం5, బీఎండబ్ల్యూ ఎం8 కంపిటీషన్ కార్లను ఇక్కడ విక్రయిస్తోంది. వీటి ధరలు కూడా 3 శాతం పెరగనున్నాయి. మన దగ్గర బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Also Read: Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!
మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ ఇప్పటికే ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి ధరల పెంపు ఉంటుందని తెలిపింది. అన్నీ మోడల్ కార్ల ధరలు 3 శాతం పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు చెప్పింది. బెంజ్ ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు కార్లను బెంజ్ విక్రయిస్తోంది.