టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నెంబర్-1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు 7 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని డాక్టర్లు సూచించారు. అయితే, అఫ్ఘానిస్తాన్ తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, వన్డే వరల్డ్‌కప్-2023లో ప్రభావం చూపలేకపోయిన సూర్య.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి టీ20 సిరీస్‌లో అద్బుతమైన బ్యాటింగ్ తో రాణించాడు. తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన సూర్య సొంతగడ్డపై 4-1తో ఆసీస్‌పై సిరీస్ నెగ్గాడు.. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా అద్భుతంగా రాణించి సౌతాఫ్రికా గడ్డపై ఆతిథ్య జట్టుతో ట్రోఫీని పంచుకున్నాడు.
Read Also: Delhi : తింటుంటే భుజం తగిలిందని బాలుడిని చంపిన మైనర్..
ఇక, దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి టీమ్ ను సూర్యకుమార్ యాదవ్ గెలిపించాడు. 56 బంతుల్లోనే 100 రన్స్ చేసి చేయడంతో పాటు టీమిండియా 106 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే సూర్యకు గాయం అయింది. జొహన్నస్‌బర్గ్‌లో డిసెంబరు 16న జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అతడి మడిమ మెలిక పడింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన సూర్యను డాక్టర్స్ టీమ్ పర్యవేక్షించి చికిత్స అందించింది. ఈ నేపథ్యంలో సూర్య మైదానాన్ని వీడడంతో రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే, మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నట్లు చెప్పాడు.. కానీ, తాజా సమాచారం ప్రకారం.. స్కై చీలమండ నొప్పి తీవ్రమైనట్లు బీసీసీఐ తెలిపింది. అతడు కోలుకోవడానికి సుమారు 7 వారాల సమయం పడుతుంది అని వెల్లడించింది.
Read Also: Oppo A59 5G: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్.. సూపర్ ఫీచర్స్.. ధర ఎంతంటే?
అయితే, సూర్యకుమార్ యాదవ్ అఫ్ఘానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు దూరం అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా జనవరి 11 నుంచి స్వదేశంలో టీమిండియా అఫ్గన్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉండగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఇప్పటికే టీమ్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన సూర్య సైతం ఇలా జట్టుకు దూరం కావడంతో టీమిండియాలో కలవరం మొదలైంది. జూన్ నుంచి టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఇలా వరుస ఎదురుదెబ్బలు తగలడం బీసీసీఐ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా అఫ్ఘాన్‌తో తమ ఆఖరి టీ20 సిరీస్ ఆడబోతుంది.