2024 జనవరిలో శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను కళ్లారా చూడటం కోసం ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లను నడపాలని చూస్తోంది. ప్రతి లోక్ సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక రైలులో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. అందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో.. త్వరలో షెడ్యూల్ ఖరారు కానుంది. జనవరి 22 తర్వాత రాష్ట్రం నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టానకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అంతేకాకుండా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనబోతున్నారు.