Karnataka: శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీలో వాడివేడి చర్చ
సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా నోటీసు ఆధారంగా శాంతిభద్రతలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభలో తీవ్ర వాగ్వాదం జరగగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను బీజేపీ నేత లేవనెత్తారు. ఇటీవల బెళగావిలో మహిళలను నగ్నంగా ఊరేగించడం, హవేరీ గ్యాంగ్ రేప్, సైబర్ క్రైమ్, టెర్రర్ సంబంధిత కార్యకలాపాల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. దీనిపై చర్చ జరగాలి. ఈ విషయం గత సెషన్‌లో జాబితా చేయబడింది, కానీ చర్చించలేకపోయిందని మండిపడ్జారు.
Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్‌పీ” చట్టం..
బీజేపీ ఆరోపణలపై ప్రభుత్వం ఏం చెప్పింది?
అసెంబ్లీలో జరిగిన గందరగోళాన్ని చూసిన రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లేవనెత్తాలని అన్నారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందని, అలాగే బీజేపీ హయాంలో జరిగిన హత్యలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు బహిరంగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించారో కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆర్.అశోక్‌కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. హవేరీ గ్యాంగ్ రేప్ కేసులో సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదైనందున ఈ కేసు చాలా ముఖ్యమైనదని అన్నారు. మాండ్యాలో హనుమాన్ జెండా ఎగురవేసే విషయంలో సరిగ్గా అదే జరిగిందని.. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో అరాచక వాతావరణం కనిపిస్తోందని బీజేపీ నేత అన్నారు.