NTV Telugu Site icon

Raghunandan Rao: పంచాయతీల కాల పరిమితి ముగిసింది.. వెంటనే ఎన్నికలు జరపాలి..

Raghunandan

Raghunandan

Raghunandan Rao: కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమి మారలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశామన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ వన్ పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారన్నారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు ముప్పై రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఒకమాట… అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీ ఒక నెల వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నామన్నారు. నాలుగు లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని.. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు.

Read Also: T Square: న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్‌లో ‘టీ-స్క్వేర్’.. టెండర్లకు ఆహ్వానం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని రఘునందన్‌ రావు ప్రశ్నించారు. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. ధరణి పరిస్థితి ఎంటి ? ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారు… ఈ ప్రభుత్వం అదే చేస్తుందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవుల భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజులు వెళ్తున్నారని విమర్శించారు. పంచాయతీల కాల పరిమితి ముగిసింది.. వెంటనే ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

కులగణన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు వాయిదా వేసేందుకు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు నెలకు 1200 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారని.. ఆ ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు తప్పితే ఏమీ మారలేదన్నారు. బీజేపీలోకి రావాలి అనుకునే ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పడంతో కాస్త చేరిక ఆలస్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని రఘునందన్ పేర్కొన్నారు.