K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ నీటి మూటలే అంటూ ఎద్దేవా చేసారు. కౌలు రైతులను రైతు భరోసా పథకంలో మర్చిపోయారని ఆయన విమర్శించారు.
Also Read: DK Aruna: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
ప్రభుత్వం దగ్గర రైతుల డేటా మొత్తం ఉన్నప్పుడు కొత్తగా సర్వేలు అవసరమేంటని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ప్రారంభాన్ని సంక్రాంతి నుండి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జనవరి 26 అంటున్నారు. ఇది ప్రభుత్వ అజమాయిషీని చూపిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ రైతులకు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతుల కోసం ఉద్యమం చేస్తామని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామంటూ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Also Read: Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
అంతేకాకుండా.. కాంగ్రెస్ అంటేనే మోసానికి నిర్వచనమని.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి వరకు ప్రజలను, రైతులను మోసం చేసిన వారే అంటూ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ నేతలు నేలకు ముక్కు రాసి ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రైతాంగానికి సకాలంలో న్యాయం చేయడం బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.