Site icon NTV Telugu

MLA Raja Singh: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..

Mla Rajasingh

Mla Rajasingh

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది. మృతుల కుటుంబానికి ఊహించలేని దుఃఖాన్ని కలిగించింది. బాధితులకు పరిపాలన సాధ్యమైనంత మద్దతు అందించాల్సిన సమయంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి వారిపట్ల అసభ్యకరంగా, అనైతికంగా వ్యవహరించాడు.

READ MORE: Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

ఆ అధికారి ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబం నుంచి ₹2.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా.. ఇంట్లోని ఓ మహిళా సభ్యురాలి పట్ల అభ్యంతరకరమైన భాషను కూడా ఉపయోగించారు. ఆ అధికారి ఆమె ఫోన్‌ను లాక్కొని బెదిరింపులకు దిగాడు. ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టడం దారుణం.. ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజా సేవా నైతికతను ఉల్లంఘించడం. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డపేరు తెస్తాయి. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో పూర్తి దర్యాప్తు జరిగే వరకు సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయండి..సంఘటనపై ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించండి. అధికారిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా చూసుకోండి. బాధిత కుటుంబానికి అవసరమైన రక్షణ, మద్దతు అందించాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version