గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే సమయంలో ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. MIM కి గంటల తరబడి సమయం ఇచ్చారు… 8 మంది ఉన్న మాకు మాత్రం సమయం ఇవ్వలేదన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వము ఎక్కడ తప్పులు చేసిందో శ్వేత పత్రంలో చెప్పలేదు. లోతైన చర్చ జరగలేదు… జరిగిన అవినీతి పై సమగ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరించలేక పోయింది. లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ కాళేశ్వరం మీద ఎందుకు చర్చ పెట్టలేదు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన దగ్గర ఉన్న ఆధారాలన్నీటిని సీబీఐకి ఇవ్వాలి. సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయాలి. మా పైన మోటార్లకు మీటర్లు పెడతారని కుట్రతో ఆ పార్టీ దుష్ప్రచారం చేసింది. మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూల్ చేయాలని కేంద్రం ఎప్పుడు చెప్పలేదని సభలో ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా brs నేతలు బుద్ది తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ పథకం లో మోడీ బొమ్మ పెట్టాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. శ్వేత పత్రం ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెప్పదలచుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు’ అని పేర్కొన్నారు.