Surender Matiala: ఢిల్లీలోని ద్వారకా జిల్లాలోని బిందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటియాలా రోడ్‌లో తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకుడు సురేంద్ర మతియాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని మృతుడి బంధువు రామ్ సింగ్ పేర్కొన్నారు. దుండగులు అనేక రౌండ్లు కాల్చారని.. అందులో 4-5 బుల్లెట్లు సురేంద్రను తాకాయని.. నేరం చేసిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. మొత్తం నలుగురు వ్యక్తులు కార్యాలయంలో కూర్చున్నట్లు రామ్ సింగ్ తెలిపారు.
Read Also: ఆడవారిలో గడ్డాలు, మీసాలు.. ఎందుకు వస్తాయి.. పోవాలంటే?
సురేంద్ర మతియాలా టీవీ చూస్తుండగా.. తాను, మరో ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో సురేంద్రపై కాల్పులు జరిగాయని రామ్ సింగ్ వెల్లడించారు. విషయం అర్థమయ్యే సమయానికి సురేంద్ర మతియాలాపై కాల్పులు జరిగాయన్నారు. బీజేపీ స్థానిక నాయకుడు సురేంద్ర మతియాలా ఇమేజ్ ఈ ప్రాంతంలో చాలా బాగుందని, ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని కొందరు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కార్యాలయం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామని, ఈ దశలో ఉద్దేశం స్పష్టంగా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.