Vishnu Kumar Raju: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉది.. కానీ, అప్పుడే పొత్తులు, సీట్లపై చర్చ సాగుతోంది.. కొందరు మరో ముందడుగు వేసి.. ఈ నియోజకవర్గం నాదే.. కాబోయే ఎమ్మెల్యే తానే అంటున్నారు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2024 నేనే ఎమెల్యేను అంటూ భవిష్యవాణి వినిపించారు.. డబ్బులు, మద్యం పంపిణీ చేయకుండా ఎవ్వరు పోటీ చేసినా తనదే గెలుపన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా నాదే విజయం అనే ధీమా వ్యక్తం చేశారు.. పులివెందల నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వచ్చి పోటీ చెయ్యమని సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.. పొత్తు ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో నా గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటున్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.
Read Also: AI Girlfriend: ఆ దేశంలో ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ కు పెరుగుతున్న డిమాండ్..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు ఉన్నా.. ఈ మధ్య ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. ఇదే సమయంలో.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ, ఇప్పటి వరకు టీడీపీ, జనసేనతో పొత్తుపై బీజేపీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు.. పొత్తులపై నిర్ణయం తీసుకునేది కేంద్ర నాయకత్వమే అని.. బీజేపీ అధిష్టానంపై నెట్టివేస్తున్నారు బీజేపీ ఏపీ నేతలు.