పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 106వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రాష్ట్రంలోని సుమారు 25 వేల పోలింగ్ బూత్ లలో 55 వేల మొక్కలు నాటినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇక ప్రముఖుల విషయానికొస్తే…. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని 57వ డివిజన్ లో జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నార్సింగ్ లోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. కేంద్ర పర్యాటక, సాంస్క్రతిక వ్యవహారాల మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లో, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ నల్గొండ జిల్లాలో మొక్కలు నాటారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా ‘‘సేవా పక్వాడ’’ పేరుతో బీజేపీ విస్త్రత సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసింది. అందులో భాగంగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, దివ్యాంగులకు పరికరాల పంపిణీ, చెరువుల శుద్దీకరణ వంటి పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని బీజేపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు ద్రుష్ట్యా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 55 వేలకుపైగా మొక్కలు నాటడం గమనార్హం.