BJP Leader Elopes with SP Leader’s Daughter: 47 ఏళ్ల వయస్సు గల వ్యక్తి 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయంతో కావడంతో ఆమెతో కలిసి లేచిపోయాడు. దీనిలో ఏముంది అనుకుంటున్నారా.. అయితే అతను బీజేపీ సీనియర్ నేత కావడం, ఆమె ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత కూతురు కావడమే. ఉత్తర ప్రదేశ్‌లో ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. యూపీలోని హర్దోయ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వస్తే.. 47 ఏళ్ల బీజేపీ నేత ఆశిష్ శుక్లాకు అంతకుముందే వివాహం జరిగింది. ఆయనకు 21 ఏళ్ల కొడుకు, ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆయన ప్రస్తుతం ఓ సమాజ్ వాదీ పార్టీ నాయకుడి కూతురు(26)తో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపించాడు.
అతనికి ముందే పెళ్లి కావడం, ఇరుపార్టీలు బద్ధవిరోధులు కావడంతో ఈ లవ్ ఎఫైర్ ఉత్తర ప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత కుమార్తెకు ఇటీవల వివాహం కుదిరింది. మరికొద్ది రోజుల్లో ఆమెకు పెళ్లి జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేత ఆశిష్ శుక్లా ఆమెను తీసుకుని పారిపోయాడు. దీంతో బాధిత ఎస్పీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, జిల్లా పోలీసులు రాజకీయ నాయకుడిపై కేసు నమోదు చేశారు. జంట కోసం వేట ప్రారంభించారు. బీజేపీ నేత ప్రతిపక్ష పార్టీ నేత కుమార్తెతో పారిపోవడాన్ని కమలం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు వాగ్వాదాలకు దిగడంతో ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది.
Bride Ride In The Metro: పెళ్లి కూతురు స్మార్ట్ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..
బాలిక కుటుంబ సభ్యులు ఆమె వివాహానికి సన్నాహాలు చేస్తుండగా, ఆమె శుక్లాతో కలిసి వారం రోజుల క్రితం పారిపోయిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంతలో, శుక్లాపై చర్య తీసుకోవడం ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర విభాగం అతడిని సంస్థాగత బాధ్యతల నుంచి తప్పించింది. జనవరి 12 న అతడి ప్రాథమిక సభ్యత్వాన్ని పార్టీ రద్దు చేసింది. బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ గంగేష్ పాఠక్ ప్రకారం.. శుక్లా కొంతకాలంగా పార్టీలో క్రియారహితంగా మారారు. పార్టీ కార్యకలాపాలపై ఆసక్తి చూపడం లేదని, బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారని వెల్లడించారు.
శుక్లాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, అతని ఆచూకీ గురించి అతని బంధువులను ప్రశ్నిస్తున్నామని హర్దోయ్ ఏఎస్పీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్లాతో పాటు అమ్మాయి మొబైల్ ఫోన్ నంబర్లు ఎలక్ట్రానిక్ నిఘాలో ఉంచబడ్డాయని, వారిని త్వరలో కనుక్కుంటామని ఆయన పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన బీజేపీ నేత ఆచూకీ తెలియలేదు. వారి సామాజిక ప్రతిష్టను కించపరిచేలా మహిళలను ప్రలోభపెట్టడం వంటి పలు ఆరోపణల కింద అతన్ని అరెస్టు చేయవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.