Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఇక, ప్రధాని మోదీ దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ప్రతిపక్షాలను సరిగ్గా సమీకరించినట్లయితే అధికార బీజేపీని ఓడించవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దాని కోసం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం తాము కృషి చేస్తు్న్నామన్నారు.
‘‘ప్రతిపక్షాలన్నీ సరిగ్గా ఏకమైతే బీజేపీ కచ్చితంగా ఓడిపోతుంది. కర్ణాటక ఎన్నికలే అందుకు ఉదాహరణ. విపక్షాల ఐక్యత కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. అయితే కేవలం ఐక్యత మాత్రమే సరిపోదు.. ప్రత్యామ్నాయ వ్యూహాలు కూడా అవసరం’’ అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. ఇక, ప్రపంచ మీడియాలో చూపించినట్లుగా భారత్‌లో పరిస్థితులు లేవని రాహుల్ ఆరోపించారు. అదంతా రాజకీయ ప్రచారమే అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వాస్తవంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
మంగళవారం శాంటా క్రూజ్‌లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని సిలికాన్ వ్యాలీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో మోడరేటర్, ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, బీజేపీలోని బలహీనతలను తాను స్పష్టంగా చూడగలనని అన్నారు. రాజకీయ పారిశ్రామికవేత్తగా బీజేపీలోని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని… ప్రతిపక్షాలు సక్రమంగా ఉంటేనే బీజేపీని ఓడించగలమని అన్నారు.కర్నాటక ఎన్నికలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడి బీజేపీని ఓడించిందని జనరల్ సెన్స్ అర్థమవుతోందని, అయితే మనం ఉపయోగించిన మెకానిక్‌లు ఏంటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడానికి, కథనాన్ని రూపొందించడానికి పూర్తిగా భిన్నమైన విధానాన్ని ఉపయోగించింది. కర్ణాటకలో ఏమి జరిగిందో ‘భారత్ జోడో యాత్ర’ నుంచి బయటకు వచ్చాయని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Burnt Alive: కారులో చెలరేగిన మంటలు.. నూతన వధూవరులతో పాటు నలుగురు సజీవదహనం
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 66, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 స్థానాలను గెలుచుకున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ 10 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐక్య ప్రతిపక్షంగా ఉండటంతో పాటు, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు దేశానికి ప్రత్యామ్నాయ దృక్పథం అవసరమని ఆయన అన్నారు.