ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు కొందరు వాహనదారులు. చివరకు పోలీసుల తనిఖీల్లో పట్టబడి భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారు. తాజాగా ఓ బైక్ పై ఏకంగా 277 చలాన్లు నమోదయ్యాయి. రూ. 79,845 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారుడిని కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.
Also Read:Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనికీల్లో ఐదు సంవత్సరాలకు పైగా 277 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోయిన ఒక మోటార్ సైకిల్‌ను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంపై మొత్తం రూ. 79,845 /- జరిమానా బకాయి ఉన్నట్లు గుర్తించి, వెంటనే దానిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడి ప్రాంతంలో జరిగింది. సాధారణ ట్రాఫిక్ నియంత్రణ, పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ పి. రమేష్, సహా వారి బృందం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో హీరో యునికార్న్ మోటార్ సైకిల్ {TS 02 EX 1395} ను ఆపి, వాహన వివరాలను ధృవీకరించగా భారీ సంఖ్యలో ఉల్లంఘనలు నమోదైనట్లు వెల్లడైంది. ఈ చలాన్లు జూన్ 8, 2019, డిసెంబర్ 25, 2024 మధ్య కరీంనగర్, పరిసర ప్రాంతాలలో నమోదయ్యాయి.
వాహనం నడుపుతున్న వ్యక్తిని కరీంనగర్‌లోని గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ (వయస్సు 37), RMP ప్రాక్టీషనర్, గా గుర్తించారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం 277 చలాన్లలో ఎక్కువ భాగం కరీంనగర్ ట్రాఫిక్ పి.ఎస్. (264) పరిధిలో నమోదయ్యాయి. ప్రధాన ఉల్లంఘనల వివరాలు:
ఉల్లంఘన – పెండింగ్ చలాన్ల సంఖ్య
హెల్మెట్ లేకుండా 254
ఫేస్ మాస్క్ ధరించకపోవడం 10
ట్రిపుల్ రైడింగ్ 07
సెల్ ఫోన్ రైడింగ్ 02
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లకపోవడం 02
సక్రమంగా లేని నంబర్ ప్లేట్ 01
జిగ్ జాగ్ డ్రైవింగ్ 01
మొత్తం 277
Also Read:Vizag Crime: యువతి కోసం రౌడీషీటర్ల ఘర్షణ.. కత్తితో దాడి.. కాళ్లు, చేతులు కట్టేసి కాలువలో విసిరేసి..!
ఈ సందర్భంగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), కరీంనగర్, యాదగిరిస్వామి మాట్లాడుతూ.. “ఇంత పెద్ద మొత్తంలో చెల్లించని జరిమానాలు ట్రాఫిక్ చట్టాల పట్ల ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడిన తీరు కచ్చితంగా నిర్లక్ష్యమేనన్నారు.. వీటిని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారన్నారు. బకాయి ఉన్న మొత్తం (రూ. 79,845) వసూలు చేయడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు వెంటనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.