2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కౌంట్‌డౌన్ మొదలైంది. నేటితో మొదటి దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచార గడువు ముగియగానే.. నియోజకవర్గాల నుంచి నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం (ఈసీ)ఇప్పటికే స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తల ఎవరూ సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. గురువారం (నవంబర్ 6) తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నేడు ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ పాల్గొననున్నారు. గయ పట్టణంలో రోడ్ షోతో పాటు భోజ్ పుర్ జిల్లాలోని కోయల్ వర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో జేపి నడ్డా పాల్గొంటారు. జాలే అసెంబ్లీ నియోజకవర్గంలో, తూర్పు చంపారన్ జిల్లా కేంద్రమైన మోతీహారీలో, పడమర చంపారన్ జిల్లా కేంద్రమైన బేతియాలో మూడు బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. నాలుగు బహిరంగసభల్లో రాజనాధ్ సింగ్ పాల్గొననున్నారు.
నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండగా.. ఫలితాలు వెల్లడవుతాయి. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు తేజస్వీ యాదవ్ ప్రతిష్టకు, నితీశ్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. ఎన్డీఏ కూటమి మరలా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతోంది. ‘మహాగఠ్‌బంధన్’ సీన్ అభ్యర్థి తేజస్వీ ఉద్యోగాల హామీతో విజయం సాధించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు.