కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుంది. అయితే, పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 28 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి లక్ష 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి అదనంగా చుక్క నీరు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు.
Read Also: Ranga Reddy: ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వల్లే నీరు వస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆ నీటితోనే రైతులు వరి ధాన్యం పండిస్తున్నారు.. తెలంగాణలో వ్యవసాయ పొలాలకు పారే ప్రతి నీటిబొట్టు.. పండే ప్రతి కంకి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల పుణ్యమేనంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎస్సారెస్పీ, కడెం, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలకు నీరు ఇచ్చాం.. కానీ లక్షల కోట్లు అప్పు చేయలేదు అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Read Also: Horse Gram Cultivation: ఉలవ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. ఆస్తులను కాపాడుతాం.. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావును అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడాలి అని భట్టి విక్రమార్క కోరారు.