ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతట సంబరాలు అంబరానంటాయి. అంతేకాకండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తాము ఉన్న చోట స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఒక చోట మాత్రం చిరకాల ప్రత్యర్థులుగా భావించే భారత్, పాక్ పౌరులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ అరుదైన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో జరిగింది.
భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందే అంటే ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే చేసుకుంటుంది. అయితే భారత్, పాక్ అంటే ఎప్పటికీ ప్రత్యర్థులే అని అనుకుంటూ ఉంటారు. ప్రతి చోటా ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రికెట్ విషయంలో ప్రత్యర్థులు పోరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా పోటీ పడి మరీ చోటు చేసుకుంటాయి. అయితే ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రం అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
దాయాది దేశాల పౌరులు ఒక చోటే చేరి వేడుకలు చేసుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా మారింది బ్రిటన్ లోని లండన్ లోని ఓ వీధి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ పాటలతో భారత పౌరులు వేడుకలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న పాక్ పౌరులు కూడా వారితో పాటు పాల్గొని డ్యాన్స్ చేశారు. లండన్‌లోని పికాడిల్లీ సర్కస్‌లో ఈ అత్యంత అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్, భారత్ పౌరులందరూ తమ జాతీయ జెండాలు పట్టుకొని పాటలు పాడారు. భారత్‌కు చెందిన మ్యుజిషియన్, ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రెటీ అయిన విష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్, పాక్ పౌరులను తాను కోరినట్లు విష్ తెలిపారు.
Also Read: Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్‌లు
బాలీవుడ్ పాటలైన ‘తేరీ మిట్టి’, ‘జై హో’, ‘మా తుజే సలామ్’, ‘సందేసే ఆతే హై’ వంటి పాటలను పాడారు విష్. ఈ పాటలకు అక్కడి భారతీయులు ఆనందంతో డ్యాన్స్ లు చేశారు. సింగర్ తో కలిసి పాటలు పాడారు. దీంతో అక్కడే ఉన్న పాకిస్థానీయులు కూడా ఆ గుంపులో చేరి సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ పేర్కొంటున్నారు. కేవలం భారత్, పాక్ పౌరులు మాత్రమే కాకుండా వేరే దేశం వారు కూడా ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.