తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని శిల్ప కళాశోభిత కళ్యాణ మండపం ఈ మహోత్సవానికి వేదిక కానుంది. ప్రత్యేక ఆకర్షణగా, తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ఉత్సవానికి స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఈ వేడుకలకు హాజరుకాలేదు. గత తొమ్మిది సంవత్సరాలలో దేవాదాయ శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) దంపతులు, కేసీఆర్ మనమడు వంటి అధికారులు మాత్రమే ప్రభుత్వం తరఫున వస్త్ర సమర్పణ చేశారు. ఇప్పుడు, 2025లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరుకావడం భక్తులకు ఉత్సాహాన్నిస్తుంది.
భద్రాచలం పట్టణం ఈ వేడుకల దృష్ట్యా భక్తజనసంద్రంగా మారింది. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 1800 మంది పోలీసులు విధుల్లో నియమితులయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా బలగాల నిఘాలో ఈ ఉత్సవం జరుగుతుంది.
భక్తుల సౌకర్యార్థం 80 తలంబ్రాల కౌంటర్లు, 19 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియాన్ని మొత్తం 24 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను నియమించారు. ఫ్రీ గ్యాలరీలో 32,000 మంది భక్తులు కూర్చొని కళ్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు.
సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తుల కోసం ఈ ఉత్సవాన్ని సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. పలు టీవీ చానళ్ల ద్వారా ఈ వేడుకలు ప్రసారమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఈ సదవకాశం అందుబాటులో ఉండనుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 8:30కి హైదరాబాద్ నివాసం నుండి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని, ప్రత్యేక హెలికాప్టరులో భద్రాచలం వెళతారు. ఉదయం 10:00 గంటలకు హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని, 10:40కు భద్రాచలం చేరుకుని స్వామి వారిని దర్శిస్తారు. 11:10 నుండి 12:30 వరకూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సారపాకలో లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసి, హైదరాబాద్‌కు పయనమవుతారు.
భక్తులందరికీ త్రాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, మరుగుదొడ్లు, ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ సేవలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మజ్జిగ పంపిణీ వంటి సదుపాయాలు సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లతో భద్రాచలం మరోసారి “భక్తాద్రి”గా వెలిగిపోనుంది.
Health Tips: ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు.. గోల్డెన్ బెనిఫిట్స్ మీ సొంతం