భద్రాచలం పట్టణంలో ఓ ఆధ్యాత్మిక సంస్థ నిర్మిస్తున్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భవనం కింద శిథిలాల్లో ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు. బుధవారం సాయంత్రం నుంచి శిథిలాల తొలగింపు చర్యలు ప్రారంభించారు. గత రాత్రి బతికి ఉన్నాడని భావించి కామేష్ అనే మేస్త్రీని బయటికి తీసుకు రావడానికి సింగరేణి రెస్క్యూ బృందం తీవ్రంగా ప్రయత్నం చేసింది. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అయితే బయటకు తీసుకొచ్చే సమయానికి అతడు మృతి చెందాడు. దాంతో కామేష్ కుటుంబసభ్యులు బోరున ఏడ్చారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది.
ఉపేందర్ అనే మరో మేస్త్రీ శిథిలాల లోపలే ఉన్నాడు. అయితే అతను కూడా మృతి చెందాడని భావిస్తున్నప్పటికీ.. అందులో స్పష్టత రావలసి ఉంది. అయితే ఇప్పటి వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదని ఉపేందర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున శిథిలాల్లో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటివరకు అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వలేదు. ఘటన సమయంలో భవనంలో ఆరుగురు నుంచి ఏడుగురు వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటిపైనే సామర్థ్యానికి మించి జీ+5 నిర్మాణం చేపట్టాడు. దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ.. కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.