ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషాద ఘటనపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంబరాల కంటే జనం ప్రాణాలు ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్ షోలు అవసరం లేదన్నారు.
ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో ముంబైలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి గౌతమ్ గంభీర్ గురువారం మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో ఆర్సీబీ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందడం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. గౌతీ స్పందించారు. ‘జనం ప్రాణాలు అన్నింటికన్నా ముఖ్యం. ఎప్పుడూ నేను ఇదే చెబుతూనే ఉంటా. రోడ్ షోలు నిర్వహించడం గురించి మనం అవగాహన ఉండాలి. వేడుకలు స్టేడియంలో నిర్వహించుకోవచ్చు. ఇది చాలా విషాదకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇలాంటివి మరలా జరగకూడదని కోరుకుంటున్నా. ఇక ముందైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి రోడ్ షోలు చేయొద్దు’ అని గంభీర్ పేర్కొన్నారు.
Also Read: ENG vs IND: ఇక నుంచి ఇంగ్లండ్‌లో టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీ!
బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో ఆరుగురు, వైదేహి ఆసుపత్రిలో నలుగురు, మణిపాల్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకోవడంతో చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. దాదాపు 2.5 లక్షల మంది అభిమానులు స్టేడియం వద్దకు వచ్చారు. అంచనాలకు మించి జనం రావడంతో.. వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. అదే సమయంలో వర్షం కురవడంతో.. తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.