త్వరలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి టెస్ట్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. త్వరలోనే ఈ ట్రోఫీని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
ఇంతకుముందు ఇంగ్లండ్, భారత్ జట్లు ఇంగ్లండ్ గడ్డపై పటౌడీ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్‌లో తలపడేవి. భారత మాజీ కెప్టెన్లు ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు. అయితే ఆ పేరును ఇప్పుడు రిటైర్ చేయాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ మేరకు గత మార్చిలో పటౌడీ కుటుంబానికి లేఖ రాసింది. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండ్యూలర్, జేమ్స్ అండర్సన్‌ల పేరుతో ట్రోఫీ ఇవ్వనున్నారు. టెండూల్కర్ అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రికార్డును కలిగి ఉండగా.. అండర్సన్ అత్యధిక వికెట్స్ తీసిన పేసర్‌గా ఉన్నాడు.
Also Read: French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2007లో తొలిసారిగా పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టారు. ఇంగ్లండ్‌లో జరిగే ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌కు పటౌడీ ట్రోఫీని అందిస్తారు. అయితే ఈసారి ఈ సిరీస్‌కు టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీని ఇవ్వనున్నారు. పటౌడీ ట్రోఫీని రిటైర్ చేయబోతున్నారనే వార్తలపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును తీవ్రంగా విమర్శించారు. 200 టెస్టులు ఆడిన టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (15,921) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆండర్సన్ ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు (704) తీసిన బౌలర్‌గా, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేస్ బౌలర్‌గా ఉన్నాడు.