Vijayawada: తోటి వ్యాపారులపైనే దాష్టీకానికి పాల్పడ్డారు. బకాయిలు అడిగినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. విచక్షణ మరిచి.. బట్టలు ఊడదీసి కొట్టారు. ఆపై వీడియోలు రికార్డు చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడ వ్యాపారులు దాష్టీకం ప్రదర్శించారు. బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. కోపంతో ఊగిపోయిన బెజవాడ వస్త్ర దుకాణ వ్యాపారి విచక్షణ మరచి.. ఇద్దరు వ్యాపారుల బట్టలు ఊడదీసి దాడి చేశాడు. వారిని నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు.
Also Read: Tirumala: శ్రీవారి ఆలయంలో అపశృతి.. మహాద్వారం వద్ద పడిపోయిన హుండీ
అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యాపారులను వీడియోలు తీశాడు. ఆపై వీడియోలను ధర్మవరంలో వ్యాపారులకు పంపించి వికృతంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న బెజవాడ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. బెజవాడ వ్యాపారి ఆగడాలపై ఆరా తీస్తున్నారు.