Site icon NTV Telugu

BCCI Review Meeting: బీసీసీఐ సమీక్ష సమావేశం.. తేలనున్న సీనియర్ ఆటగాళ్ల, కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యం?

Bcci

Bcci

BCCI Review Meeting: భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో పరాజయం పాలవడంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రదర్శనపై సీరియస్ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓటమి, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి గల కారణాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, తాత్కాలిక కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ హాజరుకానున్నారు. గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించినప్పటి నుండి టీ20 ఫార్మాట్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌ లలో జట్టు తడబడుతోంది.

Also Read: Redmi 14C: బెస్ట్‌ ఆప్షన్స్‭తో పది వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేసిన రెడీమి మొబైల్

భారత జట్టు బంగ్లాదేశ్‌పై 2-0తో విజయాన్ని సాధించిన తర్వాత, వరుసగా మూడోసారి WTC ఫైనల్‌కు చేరుతుందని భావించారు. కానీ, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో పరాజయం, ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల ఫామ్ విషయంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సిడ్నీ టెస్టులో పచ్చటి పిచ్‌లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలనే నిర్ణయం గంభీర్‌పై ప్రశ్నలు తలెత్తించింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో జరిగిన పరాజయాలపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నెలలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లు, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ప్రస్తుతానికి పెద్ద మార్పులు చేయకపోయినా, సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా జట్టును ఎంపిక చేసే విషయంలో చర్చ జరుగుతుందని సమాచారం. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 12న మరో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో దేవ్‌జిత్ సైకియా కార్యదర్శిగా, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఎన్నిక కానున్నారు. మొత్తానికి బీసీసీఐ దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఈ సిరీస్‌ భారత జట్టుకు కీలకమైన సమీక్షా అంశాలుగా ఉండనున్నాయి. ఇక గంభీర్ కోచింగ్‌తో పాటు, రోహిత్, విరాట్ వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు పైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version