UP: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక విషాదకర, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేశాడు. ఈ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్రాపూర్ మజ్రా సైదాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం తన భార్య మునిశ్రా రావత్‌కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని బాధితుడు ఫతే బహదూర్ వివరించాడు. దీంతో ఆమెను కోఠి బజార్‌లోని జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, వివేక్ మిశ్రా నిర్వహిస్తున్న శ్రీ దామోదర్ ఔషధియాలయ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన ఆ నకిలీ వైద్యుడు జ్ఞాన్ ప్రకాష్ ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని నిర్ధారించాడు. ఆపరేషన్ చేయాలని రూ. 25,000 ఖర్చు అవుతుందని తెలిపాడు. బాధితుడు రూ. 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
READ MORE: Doctors Negligence: డెలివరీ సమయంలో గర్భిణీని టార్చర్ పెట్టిన డాక్టర్లు.. పసికందు మృతి
బాధితుడు ఫతే బహదూర్ డబ్బు మొత్తం చెల్లించాడు. అనంతరం.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నకిలీ వైద్యుడు జ్ఞాన్ ప్రకాష్ యూట్యూబ్ వీడియో చూసి ఆ మహిళకు ఆపరేషన్ ప్రారంభించాడు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆమె పొత్తికడుపులో లోతుగా కట్ చేశాడు. చిన్న ప్రేగు, గొట్టాలు, పలు నరాలను కత్తిరించాడు. ఎలాగోలా ఆపరేషన పూర్తి చేశాడు. ఆపరేషన్ అనంతరం.. ఆ మహిళ రాత్రంతా నొప్పితో బాధపడుతూ మరుసటి రోజు ఆసుపత్రిలో మరణించింది. దీంతో ఆసుపత్రి నిర్వాహకుడు జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, అతడి కుటుంబం పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. చిన్నపేగు, నరాలు కట్ చేయడం వల్ల మహిళ మృతి చెందినట్లు తేలింది. మృతురాలి భర్త ఫతే బహదూర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.