‘‘మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?… ఎంఐఎం అరాచాకాలు శ్రుతి మించినా ఎందుకు నోరు మెదపడం లేదు? గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకుంటే కేసులు పెట్టి వేధిస్తున్నరు. ఛత్రపతి శివాజీ వేడుకులు చేసుకుంటే పోలీసులతో బెదిరిస్తరు. ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను పాతబస్తీలోని ఎంఐఎం కార్యకర్తలకు పంచిపెడతరు? ఇదేం పాలన?… పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టార్ క్యాంపెయినర్ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ ను బొందపెట్టి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని స్థాపించుకుందామని పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా అందెల శ్రీరాములు యాదవ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా వేలాది మందితో అట్టహాసంగా జరిగిన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీలో ప్రసంగించాలని భావించినప్పటికీ హెలికాప్టర్ లో ఖానాపూర్ వెళ్లాల్సి రావడం, సమయం మించిపోవడంతో మాట్లాడలేకపోయారు. ఈ నేపథ్యంలో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు..
• మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు ఏం పాపం చేసుకున్నరో అర్ధం కావడం లేదు. ఈ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్స్ స్థానికులకు ఇవ్వకుండా పాతబస్తీకి చెందిన MIM కార్యకర్తలకు, ఓ వర్గానికి ఇస్తున్నరు. ఫార్మా సిటీ కోసం ఇదే నియోజకవర్గంలోని కందుకూర్ మండలంలో 19వేల ఎకరాలు తీసుకున్నరు. ప్యాబ్ సిటి పేరుతో రైతుల నుండి పెద్ధ ఎత్తున భూమలు తీసుకున్నరు. ఇన్ని వేల ఎకరాల భూములు తీసుకున్న ప్రభుత్వం స్థానికులకు మాత్రం ఒక్క ఉద్యోగమివ్వలేదు. ఉపాధి కల్పించకుండా రైతుల పేదల పొట్టకొడుతున్నారు. వేల ఎకరాలు భూమిని రైతుల నుంచి లక్షల్లో కొనుక్కుని కోట్ల రూపాయలకు అమ్ముకుంటారా? ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం బ్రోకర్ పాత్రను పోషించడం బాధాకరం.
• ఈ జిల్లా మంత్రి భూకబ్జాలకు, అవినీతి, అక్రమాలకు అంతులేదు. ధరణి పేరుతో ఆమె తనయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నడు. ఇప్పుడు ఎలక్షన్లలో గెలవాలని అన్ని అడ్డదారులు తొక్కుతున్నరు. రోజుకు 70 నుంచి 100 శిలాఫలకాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నరే తప్ప చేసిన అభివృద్ధి శూన్యం. బడంగ్ పేట- మీర్పెట్ కార్పొరేషన్లల్లో అధికంగా ఇంటి పన్నులు వేస్తూ ఇబ్బంది పెడుతున్నరు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో సమానంగా ఇంటి, నల్లా ఛార్జీలున్నయంటే పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోండి. మహేశ్వరంలో 100 పడకల ఆస్పత్రి కట్టిస్తానని మాట తప్పి 30 పడకల ఆస్పత్రికే పరిమితైనరు. డాక్టర్లుండరు. సిబ్బంది లేరు. ఎలక్షన్లలో గెలవాలని కుల సంఘాల నాయకులకు ప్రతీ ఏరియాలో భూములిస్తూ ఎరవేస్తుండటం సిగ్గు చేటు.
• తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఈ నియోజకవర్గ బిడ్డ సిరిపురం యాదయ్య కుటుంబాన్ని ఇంతవరకు ఆదుకోలేదు. బడంగ్ పేటలో 60-70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళితుల భూములను లాక్కుని కట్టిన గ్రంథాలయానికి మంత్రి భర్త పేరు పెట్టుకోవడం సిగ్గు చేటు. అభివ్రుద్ధి పేరుతో దళితుల, పేదల భూములను లాక్కోవడం దుర్మార్గం. వందల వేల ఎకరాలు కబ్జా చేసుకున్న బీఆర్ఎస్ లీడర్ల, భూ బకాసూరుల భూములు స్వాధీనం చేసుకునే దమ్ము లేదా? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఓ డమ్మీ. మేడ్చల్ నుండి వలస వచ్చి పోటీ చేస్తున్నడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలిద్దరూ కాంగ్రెస్ నుండి వచ్చిన వలసపక్షులే. మీకు అండగా ఉంటూ బీఆర్ఎస్ అరాచకాలపై, ప్రజా సమస్యలపై పోరాడుతున్న శ్రీరాములు యాదవ్ పై దాడులు చేస్తున్నరు. లాఠీఛార్జ్ చేస్తున్నరు. శ్రీరాములు యాదవ్ పక్కా లోకల్. ఆయనకు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని మహేశ్వరం ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నా. వలస పక్షులను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని తెలంగాణ సమాజానికి చేతులెత్తి వేడుకుంటున్నా.
• అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట సబితా ఇంద్రారెడ్డి. ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచి ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవులను అనుభవించడం సిగ్గు చేటు. మహేశ్వరం నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానికులకు ఇవ్వకుండా పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలకు ఇవ్వడం దుర్మార్గం.
• వీటిపై ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నరు. గణేష్ మండపాలు పెడితే పోలీసులతో కేసులు పెడుతున్నరు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి’ చేస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నరు. నందనవనం కాలనీలో మైనర్ బాలికపై “గ్యాంగ్ రేప్’ చేస్తే పట్టించుకోరు… మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?
• తెలంగాణ ప్రజలు ఇంకా మౌనంగా ఉంటే… రేపు బొట్టు పెట్టుకని, కంకణం కట్టుకుని కూడా తిరగలేరు. మీ ఇండ్లమీదకొచ్చి దాడులు చేస్తరు. మీ ఆస్తులను లాక్కొంటరు. గల్లీకో ఖాసీం రజ్వీ పుట్టకొస్తడు… అందుకే బీఆర్ఎస్ ను బొందపెట్టాలి. బీజేపీని గెలిపించి రామరాజ్యం తెచ్చుకుందాం.
• బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లిస్తాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఆరోగ్య బీమా, ఫసల్ బీమా సదుపాయం కల్పిస్తాం.