Bandi Sanjay Slams Telangana Govt for House Arrest of Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంటి? అని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని మండిపడ్డారు. భాగ్యనగరంలో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం అని పేర్కొన్నారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా.. శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్తారనే సమాచారంతో రామచందర్ రావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
Also Read: Raja Singh: బీజేపీలో చేరుతున్నారా?.. కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి పెట్టుకోండి!
కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రామచందర్ రావు గృహ నిర్బంధం విషయం తెలిసిన వెంటనే స్పందించారు. ‘పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?. భాగ్యనగరంలో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా.. శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయి’ అని బండి సంజయ్ హెచ్చరించారు.