Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారు. జీడీపీని పెంపులో వారి పాత్ర చాలా ఉంది. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి మర్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలి?’’ అని ప్రశ్నించారు. మర్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని అన్నారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మర్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
READ MORE: Off The Record: వైసీపీకి దమ్మాలపాటి సమాచారం చేరవేస్తున్నారా?
దీంతోపాటు రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బండి సంజయ్ చెప్పారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో బీజేపీ సెంట్రల్ జిల్లా శాఖ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా ర్యాలీ’’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “మటన్ ఎవరు కొట్టాలి? హిందువులైన కటికోళ్లు మటన్ కొట్టాలి. హిందూ రజకులు బట్టలుతుకుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది. నయీం మటన్ షాపు, సలీం డ్రై క్లీన్ షాపులు పెడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోంది. రోహింగ్యాలు గో బ్యాక్.. హిందువుల కుల వృత్తులను కాపాడాలని మేం ఉద్యమం చేస్తాం.” అని స్పష్టం చేశారు.
READ MORE: Krishna Janmashtami 2025: కృష్ణుడి ఎనిమిది మంది భార్యల పేర్లు ఇవే..
